హనుమకొండ, మార్చి 31: వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని ఆ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని పబ్లిక్‌గార్డెన్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీగా వచ్చి, చావు డప్పులతో నిరసన తెలిపారు. కార్య క్రమానికి అనుమతి తీసుకోలేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో భాగంగా ఏ రాజకీయ పార్టీ అయినా మూడు స్థానాల్లో రెండు మాదిగలకే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండు స్థానాలు మాల వర్గానికి ఇచ్చిందని అన్నారు. వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగలకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశా రు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న మాదిగలకు కేటాయించ కుండా ఉప కులాలకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగలు రాజకీయంగా ఎదగకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కడి యం కుటుంబానికి టికెట్ ఇస్తే చిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అనిల్, అల్వాల ఉమేందర్, మాదాసి శివకుమార్, వకల రవీందర్, మాదాసి సురేశ్ పాల్గొన్నారు.