వరంగల్, జూలై 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; మోదీ సర్కారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరోసారి మొండిచేయి చూపింది. మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీ పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై ఎలాంటి ప్రకటన చేయకుండా నిరాశే మిగిల్చింది. ముఖ్యంగా పదేళ్ల నుంచి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న కేంద్రం ఈసారీ వాటి ఊసెత్తకుండా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలపై నీళ్లు చల్లింది. అలాగే గిరిజన యూనివర్సిటీ, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ నిర్మాణానికి అదనపు నిధులతో పాటు మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ, వరంగల్ స్మార్ట్‌సిటీ, నియోమెట్రో ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత నివ్వలేదు. ఇక మేడారం జాతరకు జాతీయ హోదా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరించింది. ఇలా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న వాటికి నిధులు కేటాయించకుండా, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకుండా వివక్ష చూపడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
కేంద్ర బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు మరోసారి అన్యాయం జరిగింది. పదేండ్లుగా ఎదురుచూస్తున్న హామీలను మోదీ సర్కారు నెరవేర్చడం లేదు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తావన సైతం ఎక్కడా కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి దాటవేత వైఖరిని ప్రదర్శించింది. ఇదే చట్టంలో పేర్కొన్న హామీల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు నిధులను కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో అమలు చేయాల్సిన హామీలను మాత్రం మరిచిపోయింది.
పదేండ్లుగా చేస్తున్నట్లుగానే ఈసారీ పునర్విభజన చట్టంలోని హామీలను పక్కనబెట్టింది. 2014లో పార్లమెంట్లో చేసిన చట్టంలో చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీతో పాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నాలుగున్నర దశాబ్దాలుగా వరంగల్ యువత ఎదురుచూస్తున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం ప్రస్తుత బడ్జెట్లోనూ ఎలాంటి ప్రకటన చేయలేదు. రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి అవసరమైన నిధుల కేటాయింపుపైనా ఇదే తీరుగా వ్యవహరించింది. వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రస్తుత బడ్జెట్లోనూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియ మొదలైనా అవసరమైన నిధుల కేటాయింపుపైనా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
తెలుగు రాష్ర్టాల్లోని రెండు గిరిజన వర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయిస్తున్నట్లు గత బడ్జెట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన యూనివర్సిటీ ఇప్పటికే ప్రారంభమైంది. తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు. నిధుల లేమితో కొత్తగా యూనివర్సిటీని ప్రారంభించే పరిస్థితి ఉండడం లేదని అధికారులే చెబుతున్నారు.
నిరాశపరచిన పన్నుల పెంపు
పోచమ్మమైదాన్ : లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై పన్ను శాతా న్ని పెంచడం నిరాశ కలిగించింది. మొబై ల్స్, బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గించడంతో వాటి ధరలు తగ్గడం, క్యాన్సర్ ఔషధాలపై వస్తు సేవ మినహాయింపులతో వ్యాధిగ్రస్తుల కు ఊరట కలిగింది. రానున్న ఐదేళ్లలో నైపుణ్యం గల 20లక్షల మంది యువతను తయారు చేయడం, ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాల ప్రకటన వల్ల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వికసిత్ భారత్ లక్ష్యంగా వరుసగా ఏడోసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల స్థిర ఆర్థిక వృద్ధి పెంపుదల, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి.
– పీవీ నారాయణరావు, చార్టర్డ్ అకౌంటెంట్
ఉత్పత్తి రంగానికి ప్రాధాన్యత లేదు
కృష్ణకాలనీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉత్ప త్తి రంగానికి ప్రాధాన్యత కల్పించలేదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విభజన హామీల ఊసేలేదు. రాష్ట్రానికి హామీ ఇచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకు పరిశ్రమను పట్టించుకోలేదు. గిరిజన యూనివర్సిటీ ములుగులో ఏర్పాటు చేసినప్పటికీ తగిన నిధులు కేటాయించలేదు. పాలమూరు ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేదు. మూసీ ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం మొరపెట్టుకున్నా పెడచెవిన పెట్టింది. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందని, రాబోయే రోజుల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పడం ఖాయం.
– బందు సాయిలు, సీపీఎం భూపాలపల్లి జిల్లా కార్యదర్శి
బీజేపీ ఎంపీలు గళమెత్తాలి
కృష్ణకాలనీ : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. కనీసం తెలంగాణ పదం ఉచ్ఛరించకుండా, రాష్ట్ర విభజన అంశాలను ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ఎకువ నిధులు కేటాయించింది. రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలున్నప్పటికీ నిధులు కేటాయించలేదు. ఇప్పటికైనా తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీజేపీ ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలి. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. బయ్యారంలో ఉకు పరిశ్రమ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టకుండా అన్యాయం చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు కూడా నిధులు ఇవ్వకపోవడం బాధాకరం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని, బీజేపీ మాత్రం కొన్ని రాష్ర్టాలకే ప్రాధాన్యతనివ్వడం సరైంది కాదు. ఇప్పటికైనా ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పునరాలోచన చేసి తెలంగాణకు అవసరమైన నిధులు కేటాయించాలి.
– భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర
కొత్తవి లేవు.. పాత వాటికీ మోక్షం లేదు..
కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులను మంజూరు చేయలేదు. దీర్ఘకాలికంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న వాటినీ నెరవేర్చలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది వరంగల్ నగరానికి స్వయంగా వచ్చి కాజీపేటలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీన్ని పూర్తి చేసేందుకు రూ.520 కోట్లు అవసరమవుతాయని కేంద్ర రైల్వే శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో రూ.150 కోట్లను కేటాయించింది. ప్రస్తుత పూర్తిస్థాయి బడ్జెట్లో నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత లేదు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు జాతీయ హోదా గురించి ప్రస్తావించలేదు.
మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించు కోలేదు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్(ఉడాన్) పథకంలో మామునూరు ఎయిర్ పోర్టును పునరుద్ధరించాలనే ప్రతిపాదనను కేంద్రం పదేండ్లుగా పట్టించుకోవడం లేదు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియ ఇటీవల కొంత ముందుకు కదిలినట్లు అనిపించినా బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. స్మార్ట్‌సిటీగా ఎంపికైన వరంగల్ నగరానికి బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కింద ఎన్ని నిధులు కేటాయించారనేది స్పష్టత లేదు. అర్బన్ ఏరియాల్లో మెరుగైన రవాణా వ్యవస్థ కోసం నియోమెట్రో ప్రాజెక్టు నిధులపై కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయలేదు. నిధుల కేటాయింపులో వివక్ష, కొత్త ప్రాజెక్టులు లేకపోవడంతో కేంద్ర బడ్జెట్‌పై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు మొండిచేయి చూపింది
పోచమ్మమైదాన్ : కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో అన్ని రాష్ర్టాలను సమానంగా చూడకుండా బీహార్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేసి తెలంగాణకు మొండిచేయి చూపడం బాధాకరం. ఈ బడ్జెట్లో సామాన్య ప్రజలు, రైతులు, విద్య, వైద్యరంగాలకు, మౌలిక వసతుల కల్పన, రోడ్లు, రైలు, విమానాశ్రయాలు, జల రవాణా, పోర్టుల అభివృద్ధి, మహిళా అభ్యున్నతి లక్ష్యంగా వికసిత్ భారత్ సాధన దిశలో కేటాయింపులు చేయడం హర్షణీయం. అలాగే గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత, గ్రామీణ, పట్టణ ప్రాంతాల గృహ నిర్మాణాలు, స్కిల్ డెవలప్మెంట్లో కోటి మందికి ప్రాక్టికల్ శిక్షణ సందర్భంగా రూ.5000 భృతితో పాటు ఉపకార వేతనం చెల్లింపు ఊరట నిచ్చింది. ఎలాంటి సెక్యూరిటీ లేని రుణ సదుపాయం, ముద్ర లోను రూ.20 లక్షలకు పెంచడం అభినందనీయం.
– త్రిపురనేని గోపీచంద్, చార్టర్డ్ అకౌంటెంట్
పేదలకు ఒరిగిందేమీ లేదు
పోచమ్మమైదాన్ : కేంద్ర బడ్జెట్‌తో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ఉపాధి కూలీల డిమాండ్లను పట్టించుకోలేదు. మేడిపండు లాంటి బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులకు తీవ్ర నిరాశ కలిగించింది. ధరలు, నిరుద్యోగం మరింత పెరుగుతుంది. గ్రామాల్లో పనులు లేక పట్టణాలకు వలస వెళ్లడాన్ని నిరోధించేందుకు ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. వీరి కోసం తగిన నిధులు కేటాయించకపోవడంతో కోట్లాది మంది జాబ్‌కార్డులు కలిగి ఉన్నప్పటికీ కూలీలకు పనులు దొరకక అత్యంత దుర్భరంగా జీవిస్తారు. ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే దేశవ్యాప్తంగా వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
– తాటిపాముల వెంకట్రాములు, బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు
కొత్త పన్ను విధానం మేలే
హనుమకొండ చౌరస్తా : కొత్త పన్ను విధానంలో మార్పులు చేయడం ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఆదాయపు పన్ను నోటీసులకు సంబంధించిన వ్యవధిని ఐదేళ్లకు తగ్గించడంతో ఆ శాఖ నుంచి వేధింపులు తగ్గుతాయి. ముద్ర రుణాలను రూ.20 లక్షలకు పెంచడం చిన్న, మధ్యతరగతి వ్యాపారులకు ఉపయోగకరం. మహిళలకు ఆస్తుల రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీని తగ్గించడం వారికి గుర్తింపు ఇచ్చేలా ఉంది. ఆస్తి అమ్మకంపై అందుబాటులో ఉన్న ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తీసివేశారు. దీనివల్ల ఆస్తిని విక్రయించే చాలామంది కొనుగోలు ధరను పెంచలేరు, వారి మూలధన లాభాలను తగ్గించుకోలేరు. ఇంతకుముందు మూడేళ్ల కంటే ఎకువ కాలం బంగారాన్ని కలిగి ఉంటే, దాని అమ్మకంపై మూలధన లాభాలు దీర్ఘకాలికంగా పరిగణించబడి 20శాతం పన్నుకు లోబడి ఉంటాయి. ఇప్పుడు 24 నెలల హోల్డింగ్ వ్యవధి తర్వాత (36 నెలల ముందు) విక్రయించిన బంగారంపై దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఫ్లాట్ 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
– తిప్పర్తి రాఘవరెడ్డి, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్
వేతనజీవులకేదీ ఊరట
జనగామ, జూలై 23 (నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదు. వేతనజీవులకు ఊరట లభించలేదు. గతేడాది బడ్జెట్ రూ.1.12 లక్షల కోట్లు ఉంటే ఈసారి కొంతమేర పెరిగినప్పటికీ ఇది మొత్తం బడ్జెట్లో 2.59 శాతం మాత్రమే. ఈ నిధులు ఏ మాత్రం విద్యాభివృద్ధికి సరిపోవు. కనీసం 6శాతం కేటాయిస్తేనే విద్యాసంస్థలకు మౌలిక వసతులు కల్పించి, కొత్తగా ఉపాధ్యాయులను నియమించుకొని, విద్యాప్రమాణాలు పెంచుకోవచ్చు. అరకొర నిధులతో విద్యావికాసం అసాధ్యం. ఉద్యోగులపై ఆదాయ పన్ను విధానం కూడా మోసపూరితంగా ఉన్నది. ధరల పెరుగుదలకు అనుగుణంగా పన్ను మినహాయింపు కనీస ఆదాయం పెంచకపోవడం, సెక్షన్-80సీ పరిమితి పెంచకపోవడం, ఉద్యోగులకు ఏమాత్రం ఊరట ఇవ్వలేదు.
– డీ శ్రీనివాస్, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు