కాశీబుగ్గ, ఏప్రిల్ 25 : బీఆర్ఎస్ సంక్షేమ ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కాశీబుగ్గలోని ఓసిటీ ప్రాంగణంలో మంగళవారం తూర్పు నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణతల్లి, ఆచార్య జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అమరవీరుల స్తూపానికి నివాళుర్పించారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. 1994లో సూపర్‌మార్కెట్ డైరెక్టర్‌గా పని చేసిన తాను సీఎం కేసీఆర్ దయవల్ల ఈ స్థాయికకి చేరినట్లు గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రి అని కొనియాడారు. శాంతిమార్గంలో రాష్ర్టాన్ని సాధించిన మహానుభావుడన్నారు. లక్షల మంది కార్యకర్తల జీవితాలను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం..
గత పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేస్తే సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నామని వరంగల్ ఎంపీ పసునూటి దయాకర్ అన్నారు. గతంలో సాగు, తాగునీరు, కరెంట్ సమస్యలు తీవ్రంగా ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, సాగనీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రంలోని రైతులు రెండు పంటలు పండిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనతికాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మాజీ ఎమ్మెల్యే దొనెపూడి రమేశ్‌బాబు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమిక రమేశ్‌బాబు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ డాక్టర్ పోలా నటరాజ్, ముగా రాన్మోహన్రావు, కుడా మాజీ చైర్మన్ హరిహరప్రసాద్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మార్మోగిన ప్లీనరీ ప్రాంగణం
ఎమ్మెల్యే నరేందర్ ప్లీనరీ సభలో ఎన్నికల శంఖారవాన్ని పూరించారు. దీంతో జై తెలంగాణ.. జై బీఆర్ఎస్.. జై కేసీఆర్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. నరేందర్ నాయకత్వం వర్థిల్లాలంటూ ప్రతినిధులు, కార్యకర్తలు నినాదించారు. అలాగే, ప్రతినిధుల ప్రసంగాలు కార్యకర్తలను ఉత్తేజపరిచాయి. కళాకారులు ఆటపాటలు, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. డిజిటల్ వేదికగా సభా ప్రాంగణం జిగేల్ మన్నది. వేదికకు ఇరువైపులా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నిలువెత్తు కటౌట్లు ఏర్పాట్లు చేశారు. కాగా, కార్పొరేటర్లు, నాయకులు ప్రతిపాదనలు, తీర్మానాలపై చర్చించారు. ప్రారంభంలో ‘వ్యవసాయం రంగం ఒక పరిశీలన’ అంశంపై కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ప్రసంగించారు. అలాగే, భద్రకాళి ఆలయ పూజారులు ప్లీనరీలో ఆశీర్వచనం చేశారు. అనంతరం ఎమ్మెల్మే లంచ్ ఏర్పాటు చేసి కార్యకర్తలకు స్వయంగా భోజనం వడ్డించారు.