రాయపర్తి, సెప్టెంబర్ 10: మార్కెట్లో చేపల విక్రయానికి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం ఓ బ్రాండ్ కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిలషించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ఉచితంగా సరఫరా చేసిన చేప పిల్లలను ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, వరంగల్ కలెక్టర్ బీ.గోపి, జిల్లా మత్స్యశాఖాధికారి నరేశ్కుమార్నాయుడుతో కలిసి మైలారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో శనివారం వదిలారు. తొలుత పసుపు, కుంకుమ చల్లి, కొబ్బరికాయ కొట్టి గంగమ్మకు పూజలు చేశారు. సర్పంచ్ లేతాకుల సుమతీ యాదవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలోనే అతిపెద్ద జలాశయమైన మైలారం చెరువు సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో ఏడాదంతా నిండుకుండలా దర్శనమిస్తూ రైతాంగంతోపాటు మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ముదిరాజ్, గంగపుత్రులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. ఓపెన్ మార్కెట్లో మైలారం రిజర్వాయర్ చేపలు అంటే ఓ బ్రాండ్ అనేలా పేరు తెచ్చుకోవాలన్నారు. మత్స్యకార కుటుంబాలు చేపల విక్రయాల కోసం గ్రామంలో సమీకృత మార్కెట్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులతోపాటు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షల బీమా అందించి ఆదుకుంటున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదన్నారు. మైలారం రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమానికి ఏటా వేల కోట్లు : ఎమ్మెల్సీ బండా ప్రకాశ్
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏటా వేలాది కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ తెలిపారు. మత్స్యశాఖలో అవినీతి, అక్రమాల, అలసత్వ నిర్మూళనకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మత్స్య మిత్ర యాప్‌ను కులస్తులు సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బానోతు హరిసింగ్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేట ర్ ఆకుల సురేందర్‌రావు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోతు కిషన్‌నాయక్, ఎంపీడీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, ఎస్సారెస్పీ డీఈ కిరణ్‌కుమార్, ఏఈ బాలదాసు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అనూష, ఎంపీటీసీ గాడిపల్లి వెంకన్న, ఉప సర్పంచ్ బాద సారయ్య, మండల నాయకులు పూస మధు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, గారె నర్సయ్య, ఎండీ.నయీం, గబ్బెట బాబు, ఉండాడి సతీశ్ కుమార్, ఎండీ.ఉస్మాన్, కాంచనపల్లి వనజారాణి, బానోత్ సునీత, బయ్య బుచ్చిబాబు పాల్గొన్నారు.