స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ప్రారం భించింది. జిల్లాలో ఇప్పటికే 41,603 మందికి ఆసరా అందుతుండగా, అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో కొత్తగా మరో 8,424 మంది ఎంపికయ్యారు. కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతుండగా, లబ్ధిదారులు సంబురపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి, మరికొందరు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రొసీడింగ్స్, ఐడీ కార్డులు అందజేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ రోగులకు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెన్షన్లు అందజేస్తున్నారు.
ములుగు, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు జిల్లాలో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏ ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఇప్పటి వరకు 33,179మందికి ఆసరా పింఛన్లను మంజూరు చేసి చెల్లిస్తున్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరిన్ని పింఛన్లు మంజూరు చేశారు. ఈ క్రమంలో ములుగు జిల్లాలోని 9 మండలాల్లో మరో 8,424 మంది లబ్ధిదారులకు పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో ఆసరా పింఛన్ దారుల సంఖ్య 41,603కు చేరింది. జిల్లా పరిధిలోని తొమ్మిది మండలాల లబ్ధిదారులకు మంత్రి సత్యవతిరాథోడ్, జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పింఛన్లు అందిస్తున్నారు.
అర్హులందరికీ పింఛన్లు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీల ప్రకారం ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ.500 నుంచి రూ.1500 మిగిలిన పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కి పెంచారు. 2018లో దివ్యాంగుల పింఛన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు, మిగిలిన పింఛన్లను రూ.1000 నుంచి రూ.2,016కు పెంచారు. వృద్ధ్దాప్య పింఛన్ల వయోపరిమితిని తగ్గించి 57ఏళ్లు నిండిన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో 4,839 మందిని అర్హులుగా గుర్తించారు. జిల్లాలో 65 సంవత్సరాలు పైబడిన వారు 744 మంది కాగా, వితంతువులు 2056, దివ్యాంగులు 569, చేనేత కార్మికులు 35, గీత కార్మికులు 31, బీడీ కార్మికులు 4, ఒంటరి మహిళలు 146 మంది ఉన్నట్లు డీఆర్డీఏ శాఖ అధికారులు గుర్తించారు. 8,424 కొత్త పింఛన్లను మంజూరు చేయగా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తిరుగుతూ పింఛన్ కార్డులను అందిస్తున్నారు.