అణచివేత, అన్యాయం ఎకడ, ఏ రూపంలో ఉన్నా ఎదిరించిన వ్యక్తి కాళోజీ నారాయణ రావు. వందేమాతరం ఉద్యమం, ఆర్యసమాజ్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు. నిజాం, భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితిపై గళమెత్తారు. పౌర హకుల ఉద్యమాల్లో ముందుండి నడిచారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటు వేయవద్దని చెప్పడం తప్పని నక్సలైట్లనూ ప్రశ్నించారు. అన్యాయం జరిగిన ప్రతి దానిపైనా ప్రజల భాషలో రచనలు చేశారు. రాసినట్లుగా జీవించారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావును తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా గౌరవించింది.
ఆయన పేరుతో హెల్త్ యూనివర్సిటీని వరంగల్‌లో ఏర్పాటు చేసింది. అదేవిధంగా నగరం నడిబొడ్డున మూడు ఎకరాల్లో కాళోజీ కళా క్షేత్రాన్ని నిర్మిస్తోంది. ఈ కేంద్రం పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ స్వయంగా దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే అనేక సాంస్కృతిక, సాహిత్య కార్యక్ర మాలకు గొప్ప కేంద్రంగా ఏర్పడనుంది. నేడు కాళోజీ నారాయణరావు 108 జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జిల్లా యంత్రానికి ఆదేశాలు జారీ చేశారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఆయన విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించనున్నారు.
అనేక పోరాటాలు
పోరుగల్లు ఓరుగల్లులో ప్రజల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేశారు కాళోజీ. 23 ఏళ్ల వయసులో స్టేట్ కాంగ్రెస్ పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. హనుమకొండ లో ఆర్య సమాజ శాఖకు మొదటి అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాల నిర్వహించారు. 1939 ఫిబ్రవరి 8 నుంచి 11 వరకు నాలుగు రోజులు వరంగల్ సెంట్రల్ జైలులో విచారణ ఖైదీగా మొదటిసారి శిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు జీవితం గడిపారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత 1948 సెప్టెంబర్ 26న జైలు నుంచి విడుద లయ్యా రు. ఆ తరువాత, కాళోజీ ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించారు.
బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, పౌర హకుల పరిరక్షణకు నిరంతరం పోరాడారు. వామపక్ష ఉద్యమం రూపంలో చేసే హింసను వ్యతిరేకించారు. హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని గట్టిగా చెప్పేవారు. ఏదో ఒక పేరుతో ప్రజల ప్రాణాలు తీయడం అంగీకరించబోనని అనేవారు. స్వతంత్ర భారతదేశం పూర్తి ప్రజాస్వామికంగా మారకపోతే ఏ రాజ్యమైనా ఒకటేగదా అని చెప్పేవారు. కాళోజీ జీవి తం ఎప్పటికప్పడు ప్రజలకు ఏది కంటకంగా ఉన్నా… అక్షరాలతోనూ, మాటలతోనూ ఖండిస్తూ ముందుకు సా గారు. జీవిత పోరాటాల అనుభూతుల కు మాటలు తొడిగి ప్రజల భాషలో ‘నా గొడవ’ పేరుతో కవిత్వం రాశారు. ప్రజల సమస్యలను, ఆకాంక్షలను చాటిచెప్పడంతోనే ఆగకుండా ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. అందుకే కాళోజీ ప్రజాకవిగానే కాకుండా ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. సమాజంతో సంబం ధం లేదనే బతుకు మీరెట్లా బతుకుతారు, సమాజానికి సంబంధించిన ప్రతీది మనకు కావాల్సిందే… అని చెప్పడంతోపాటు అలా గే జీవించారు.
ఆయన రచనలు..
సాహిత్య పరంగా కీలకమైన ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో కాళోజీ సభ్యుడిగా వ్యవహరించారు. తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అణా కథలు, నా భారతదేశ యాత్ర, పార్థివ వ్యయము, కాళోజీ కథలు, నా గొడవ, జీవన గీత, తుది విజయం మనది, తెలంగాణ ఉద్యమ కవితలు, ఇదీ నా గొడవ, బాపూ..బాపూ..బాపూ తదితర రచనలు చేశారు. 1943లోనే కాళోజీ నారాయణరావు కథల్ని ‘కాళోజీ కథలు’ పేరుతో అప్పట్లో హైదరాబాద్‌లోని ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణా గ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.
కాళోజీ ప్రస్థానం…
కాళోజీ నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టహెళ్లి గ్రామంలో జన్మించారు. తండ్రి కాళోజీ రంగారావు, తల్లి రమాబాయి. రంగారావు పూర్వీకులు గతంలో మహారాష్ట్ర నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు. కాళోజీ రెండో ఏట వాళ్ల కుటుంబం వరంగల్‌కు సమీపంలోని మడికొండకు వచ్చింది. ఆయన ప్రాథమి క విద్య మడికొండలో, ఉన్నత విద్య వరంగల్, హైదరాబాద్‌లో సాగింది. అనంత రం న్యాయ విద్య పూర్తి చేశారు. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. 1958 నుంచి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధింపునకు నిరసనగా 1978లో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రజా సమస్యలపై నిర్విరామంగా గళమెత్తిన కాళోజీ.. తన మరణాంతరం కండ్లను ఎల్వీ ప్రసాద్ నేత్ర పరిశోధన సంస్థకు, వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలకు తన భౌతికకాయాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులకు ముందే చెప్పారు.
పురసారాలు..
ప్రజాకవిగా గుర్తింపు పొందిన కాళోజీ నారాయణరావుకు అనేక పురస్కారాలు, గుర్తింపులు వచ్చాయి. 1972లో భారత ప్రభుత్వంతో స్వాతంత్య్ర సమర యోధుడిగా సన్మానించబడ్డారు.‘జీవన గీత’ రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో ఉత్తమ అనువాద రచన అవార్డు ఇచ్చింది. బూర్గుల రామకష్ణారావు మెమోరియల్ అవార్డు వరించింది. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాళోజీని సన్మానించింది. 1992లో పద్మ విభూషణ్ పురసారం వచ్చింది. 1992లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. 1996లో సహృదయ సాహితి, విశాఖ వారి గురజాడ అవా ర్డు. 1996 లో కళాసాగర్ మద్రాస్ వారి విశిష్ట పురసారం. 1997లో ఉండేల మాల కొండారెడ్డి విజ్ఞానపీఠం అవార్డు. 1996లో నాగపూర్ యూనివర్సిటీ వారి సన్మానం, 2000లో రామినేని ఫౌండేషన్ వారి అవార్డు కాళోజీని వరించాయి.