జిల్లాలో కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతుండగా, లబ్ధిదారులు సంబురపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి, మరికొందరు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రొసీడింగ్స్, ఐడీ కార్డులు అంద జేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యేలు డీఎస్ రెడ్యా నాయక్, బానోత్ శంకర్‌నాయక్, హరిప్రియా నాయక్ కొత్త లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తూ భరోసానిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 90,718 మందికి ఆసరా అందుతుండగా, అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడంతో కొత్తగా మరో 26,198 మందికి ఎంపికయ్యారు. వీరికి బ్యాంకు ఖాతాలు, పోస్టాఫీస్‌లో పింఛన్ సొమ్ము జమ కానున్నది.
మహబూబాబాద్, సెప్టెంబర్3 (నమస్తే తెలంగాణ): సబ్బండ వర్గాలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఆసరా పింఛన్లు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. వృద్ధాప్యంతోపాటు ఇతర కారణాలతో బాధపడుతున్న వారికి భరోసానిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారుల వయసు 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించారు.
దీంతో జిల్లాలో కొత్తగా 26,198మందికి లబ్ధి చేకూరింది. వీరికి పింఛన్ మంజూరు పత్రాలతోపాటు ఐడీ కార్డులను ప్రజాప్రతినిధులు, అధికారులు పంపిణీ చేస్తున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి, మరి కొందరు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పండుగ వాతావరణంలో ప్రొసీడింగ్స్, ఐడీ కార్డులు అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 90,718మంది లబ్ధిదారులకు రూ.20.43 కోట్లు పింఛన్ డబ్బులు ప్రతి నెలా అందిస్తున్నారు. కొత్తగా వృద్ధాప్య పింఛన్లు 17,196, వితంతువులు 6,098 మంది, దివ్యాంగులు -1,992 మంది, నేత కార్మికులు 61మంది , కల్లు గీత కార్మికులు 306 మంది, బీడి కార్మికులు ముగ్గురు, ఒంటరి మహిళలు 302 మంది, బోదకాలు 240 మంది మొత్తం 26,198 మందికి ప్రతి నెలా అదనంగా రూ.5.43కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనున్నది.
కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్స్‌తోపాటు ఐడీ కార్డులను పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో, ఎమ్మెల్యే రెడ్యానాయక్ డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్, కురవి, మరిపెడ, చిన్నగూడూరు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల్లో, ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం, గార్ల మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మహబూబాబాద్ నియోజకవర్గంలో గూడూరు, కేసముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్ మండలాల్లోని లబ్ధిదారులకు స్థానిక ప్రజాప్రతినిధులు కొత్త పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నారు.
కొత్త పింఛన్‌దారుల జాబితా మండలాల వారీగా ఇలా ఉంది. బయ్యారం మండలంలో 1,409 మంది, చిన్నగూడూరు మండలంలో 624 మంది, దంతాలపల్లి మండలంలో 1,009 మంది, డోర్నకల్‌లో 1,510 మంది, గంగారంలో 354 మంది, గార్లలో 1,213 మంది, గూడూరులో 1,771 మంది, కేసముద్రంలో 2,606 మంది, కొత్తగూడలో 913 మంది, కురవిలో 2,111 మంది, మహబూబాబాద్‌లో 1,460 మంది, మరిపెడలో 1,973 మంది, నర్సింహులపేటలో 962 మంది, నెల్లికుదురులో 1,975 మంది, పెద్దవంగరలో 1,150 మం ది, తొర్రూరులో 2,055 మంది, మహబూబాబాద్ మున్సిపాలిటీలో 1,795 మంది, డోర్నకల్ మున్సిపాలిటీలో 295 మంది, మరిపెడ మున్సిపాలిటీలో 452 మంది, తొర్రూరు మున్సిపాలిటీలో 561మందికి పించన్లు మంజూరయ్యాయి.
జిల్లాలో 26,198 మందికి కొత్తగా పించన్లు మంజూరయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్, ఐడీ కార్డులు అందజేస్తున్నాం. ఈ నెలలో పంపిణీ పూర్తి చేస్తాం. వచ్చేనెల నుం చి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం.
– సన్యాసయ్య, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి