హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3 : వరంగల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(నిట్)లో స్నాతకోత్సవాలు సంబురంగా ప్రారంభమయ్యాయి. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు విభాగాల వారీగా బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేయగా అందుకొని ఆనందంతో మురిసిపోయారు. శనివారం నిట్ ఆడిటోరియంలో 20వ కాన్వొకేషన్ వైభవంగా జరిగింది. రెండు రోజుల వేడుకల్లో భాగంగా మొదటిరోజు ముఖ్య అతిథిగా బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుధీర్‌కుమార్ జైన్ పాల్గొని పతకాలు అందజేశారు.
అనంతరం జైన్ మాట్లాడుతూ నిట్ వరంగల్ చాలా ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయమని అన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లకు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. లెర్నింగ్ అనేది ఎప్పటికీ ముగియదని గ్రాడ్యుయేట్ అవుతున్నందున ఈ రోజు నా చదువు ముగిసిందని అనుకుంటే పొరపాటేనని, నేర్చుకోవడం ఎప్పటికీ అంతం కాదని, మనం నిరంతర అభ్యాసకులుగా ఉండాలని చెప్పారు. సంబంధాలే నిజమైన సంపద అని, వాటిని చకగా నిర్వహించాలని సూచించారు. కనీసం కొందరికి అయినా సహాయం చేయాలన్నారు.
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ప్రస్తుతం 21గా ఉందని టాప్ టెన్ ఇన్స్టిట్యూట్స్లో నిట్ ఉండేలా ప్రణాళికలు వేస్తున్నామని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు పేర్కొన్నారు. ఏడాది కాలంలో ఇన్స్టిట్యూట్ సాధించిన ప్రగతిపై నివేదిక సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. 893 యూజీ విద్యార్థులకు వారి డిగ్రీలు అందించామని 2021-22లో 646 యూజీ, 486 పీజీ విద్యార్థులు సహా రికార్డు స్థాయిలో 1132 మంది విద్యార్థులు నియమితులయ్యారని చెప్పారు. ఇది గతేడాది కంటే 32.24% పెరిగిందని తెలిపారు.
అత్యధిక వేతన ప్యాకేజీ రూ.62.5 లక్షలు, సగటు పే ప్యాకేజీ కూడా మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2021-22 విద్యా సంవత్సరంలో దాదాపు 17% పెరిగిందని వివరించారు. అనేక పరిశోధన ప్రాజెక్టులు, రూ.10 కోట్లతో వివిధ స్పాన్సర్ ఏజెన్సీల నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. 71 పుస్తకాలు, పుస్తక అధ్యాయాలు ప్రచురింతమయ్యాయని పేర్కొన్నారు. విద్యార్థులు, పండితులు, అధ్యాపకుల ప్రయోజనం కోసం ఆర్ఎఫ్ఐడీ ప్రారంభించి లైబ్రరీ సేవలను గత నెల 12 ఆగస్టు జాతీయ లైబ్రేరియన్ల దినోత్సవాన ప్రారంభించినట్లు చెప్పారు.
నిట్‌లో వివిధ విభాగాల్లో టాపర్‌గా నిలిచిన 8మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ అందజేశారు. సివిల్ ఇంజినీరింగ్‌లో టాటి విక్రమ్, ఎస్ఎస్ షణ్ముక సాయిమాధవ్(ఈఈఈ), లవిష్ గార్గ్(మెకానికల్ ఇంజినీరింగ్), నిక్కెంటి శ్రీకీర్తి(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), బి.శ్రీహర్ష(కెమికల్ ఇంజినీరింగ్), బుదాతి జయశివ శ్రీకృష్ణసాయి(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్), నందిని కానోరియా(బయోటెక్నాలజీ) ఉన్నారు.
మాది హైదరాబాద్ కూకట్పల్లి, అమ్మ దుర్గ గృహిణి, నాన్న మల్లేశ్వరుడు ప్రైవేట్ ఉద్యోగి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి టాపర్ అయ్యాను. గోల్డ్ మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలు, ఆశయాలను నెరవేర్చాలి.
-సాయిమాధవ్, ఈఈఈ టాపర్, హైదరాబాద్
ప్రస్తుతం పరిశోధన రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. నేను బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్‌లో నిట్ టాపర్‌గా నిలిచా. ఒకటి బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్‌లో, ఒకటి క్యాంపస్ టాపర్‌గా టూ గోల్డ్ మెడల్స్ సాధించా. ఏదో ఒక్కటి కొత్తది కనిపెట్టాలన్నదే నా లక్ష్యం. సైంటిస్ట్ కావాలనేది నా కల. చాలా మంది ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకుంటున్నారు. కానీ కెమికల్ ఇంజినీరింగ్‌కూ మంచి భవిష్యత్ ఉంది. కేవలం పుస్తకాల్లో ఉన్నవాటిని చదవకుండా బయటి జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవాలి.
– భీమినేని శ్రీహర్ష, బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్‌లో టాపర్, హైదరాబాద్