పర్వతగిరి, ఆగస్టు 30 : ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. పర్వతగిరి మండలంలోని ఇస్లావత్ తండా, చెరువుకొమ్ము తండా, ఏబీ తండా, దౌలత్‌నగర్ గ్రామాల్లో సుమారు 2 కోట్ల రూపాయలతో చేపట్టిన వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్యే అరూరి రమేశ్ మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పల్లె ప్రగతితో అద్భుత ఫలితాలు వస్తున్నాయని, గ్రామాల్లో అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని పూర్తి చేయాలని అన్నారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆయా గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న ఏకైన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. దౌలత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో మండలానికి చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేశ్ పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈపథకం పేద ప్రజలకు ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్‌లాల్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు ప్రమీలాగోపి, రమేశ్, కొల్లూరి వెంకట్, ఇందిరాజితేందర్‌రెడ్డి, సోమేశ్వర్రావు, తహసీల్దార్ కోమీ, ఎంపీడీవో చక్రాల సంతోష్‌కుమార్, సర్వర్, ఎంపీటీసీలు నాయకులు గోపి, వెంకట్రాంరెడ్డి, భిక్షపతి, కొమురయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.