గిర్మాజీపేట, ఆగస్టు 30: సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు పోషణ మాసోత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటికీ టీచర్లు, ఆయాలు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. మాతాశిశు మరణాలు తగ్గించడంతోపాటు చిన్నారుల్లో రక్తహీనత, తక్కువ బరువుతో పుట్టకుండా ఉండాలంటే గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను వివరిస్తారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా మధ్యాహ్నం చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తూనే అవగాహన కల్పించనున్నారు. ముందుగా చిన్నారుల వయస్సు, తగిన ఎత్తు, బరువును గుర్తిస్తారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆరు నెలల తర్వాత తల్లిపాలతోపాటు అనుబంధ పోషకాహారం అందించాలని, బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకూ తల్లిపాలు తాగించాలని తల్లులకు అవగాహన కల్పించనున్నారు.
జిల్లాలో వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట ఐసీడీస్ ప్రాజెక్టుల పరిధిలో 37 సెక్టార్లు ఉన్నాయి. జిల్లాలో 919 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 847 మెయిన్, 72 మినీ అంగన్వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా మంది 5,993 గర్భిణులు, 4,128 మంది బాలింతలు, 48,776 మంది చిన్నారులు లబ్ధిపొందుతున్నారు. మొదటి 15 రోజుల్లో అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకులు ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ నిర్వహిస్తారు. మూడో వారంలో అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలు, గ్రామ పంచాయతీల్లో న్యూట్రీగార్డెన్లు పెంపొందించడంపై అవగాహన కల్పిస్తారు. నాలుగో వారంలో పోషణ మానిటరింగ్ చేపట్టనున్నారు.
పోషణ లోపం నివారణే ధ్యేయం.. ఎం శారద, జిల్లా సంక్షేమ అధికారి
జిల్లాలో ఏ ఒక్కరూ పోషణ లోపం లేకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి సారించి, ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే మాసోత్సవంలో సీడీపీవోలు, సూపర్వైజర్లు, అంగన్వాడీటీచర్లు, ఆయాలు, గృహ సందర్శన చేసి పోషణ లోపంపై తల్లులకు అవగాహన కల్పిస్తారు.