రాయపర్తి, ఆగస్టు 29 : కాంగ్రెస్, బీజేపీవి బోగస్ మాటలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని కొండూరు గ్రామంలో రూ.14.50కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కలెక్టర్ బీ గోపితో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. తొలుత గ్రామంలో పర్యటించారు. రూ.89లక్షలతో నిర్మించిన సీసీ, మెటల్ రోడ్లు, మురుగు నీటి కాల్వలు, రూ.20 లక్షలతో పూర్తి చేసిన అంతర్గత సీసీ రోడ్లు, రూ.3.12 కోట్లతో నిర్మించిన 50 డబుల్ బెడ్ రూం ఇళ్లు, పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. రూ.1.80కోట్లతో చేపట్టనున్న కొండూరు-రామవరం రోడ్డు నిర్మాణ పనులు, రూ.1.68 కోట్లతో కొండూరు-మైలారం రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో బ్రిడ్జి నిర్మాణ పనులు, రూ.1.75కోట్లతో కొండూరు-బురహాన్‌పల్లి-బోజ్యా తండా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇళ్ల సముదాయం ఆవరణలో సర్పంచ్ కర్ర సరిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ప్రజాస్వామ్యాన్ని ప్రతిపక్షాలు అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నాయని, పలు రాష్ర్టాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతున్నదని మండిపడ్డారు. ప్రజల మధ్య కుల, మతాల పేరుతో చిచ్చు పెడుతూ రాజకీయంగా లబ్ధి పొందాలన్నదే బీజేపీ నేతల అంతిమ లక్ష్యంగా కన్పిస్తున్నదని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీజేపీ కండ్లు మండుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, సమృద్ధిగా సాగు జలాలు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, డబుల్ బెడ్ రూం ఇళ్లు తదితర పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దమ్ముంటే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల విషపు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే బుద్ధి చెప్పాలి..
నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందిస్తున్న మహనీయుడు కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఎనిమిదేళ్లుగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి పాటుపడుతున్న సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నేతలను ప్రతిపక్ష నేతలు విమర్శిస్తే ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ, మద్దతును చూసి జీర్ణించుకోలేకే బీజేపీ నాయకులు కుట్ర రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. ఈడీలు, మోదీలు కేసీఆర్‌ను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వ సహకారంతో బ్యాంకులు మంజూరు చేసిన రూ.3.6కోట్ల రుణాల చెక్కులు, పలువురు లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలు, గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ బానోత్ హరిసింగ్, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, ఆర్డీవో మహేందర్‌జీ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, ఎంపీటీసీ చిర్ర ఉపేంద్ర, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు కుందూరు రాంచంద్రారెడ్డి, జక్కుల వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభధ్రం, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, మండల పశు వైద్యాధికారి వీరగోని శృతి, డీఈలు, ఏఈలు కిరణ్‌కుమార్, బాలదాసు, శేషం కిరణ్‌కుమార్, అనూష, నాయకులు పూస మధు, పోల్నేని శ్యాంరావు, గుండె రామస్వామి, ఆవుల కేశవరెడ్డి, ఎండీ నయీం, మచ్చ సత్యం, గబ్బెట బాబు, వీరమనేని సత్యనారాయణరావు, పంతంగి నర్సయ్య, కొమ్ము రాజు, గుగులోత్ సోమన్న, చిర్ర కిశోర్‌కుమార్, నేరెల్లి రాములు, పులి సోమయ్య, మహేశ్, కుక్కల భాస్కర్, మాలోత్ వసుంధర్నాయక్, పరుపాటి రవీందర్‌రెడ్డి, బోనగిరి ఎల్లయ్య, బోనస్ శ్రీను, పెండ్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.