తొర్రూరు, ఆగస్టు 29 : మహాత్మాగాంధీ అంటే ప్రధాని మోదీకి ఇష్టం లేదని, స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను కించపర్చేలా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు నేతృత్వంలోని కమిటీ బృందం, దాతలు, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను సోమవారం కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్చంద్ర పవార్, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యతో కలిసి మంత్రి ఆవిష్కరించారు.
అనంతరం పెద్దఎత్తున నిర్వహించిన సభలో విద్యార్థులు, స్థానిక ప్రజలను ఉద్దేశించి ఎర్రబెల్లి మాట్లాడారు. స్వాతంత్య్ర సంగ్రామాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు బాటలు వేసి, భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహాత్మాగాంధీ పేరును ఉచ్చరించడం కూడా ప్రధా ని మోదీకి ఇష్టం లేదని, గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ తదితర స్వాతంత్య్ర యోధుల చరిత్రను వక్రీకరించేలా బీజేపీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదన్నారు. రాజ్యాంగాన్ని మార్చి దళిత గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేయాలని కేంద్రం కుట్రలు చేస్తోందని, అందులో భాగంగానే రైల్వే, బీఎస్ఎన్ఎల్తోపాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నదని ఆరోపించారు. దళితులు, అంబేద్కర్‌వాదులు, రైతులు కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
100 అడుగుల ఎత్తులో జాతీ య జెండాను తొర్రూరులో ఆవిషరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు దాతలతో కలిసి వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ టీ రవీంద్ర, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి సూచనలతో కమిటీగా ఏర్పడి ఈ బృహత్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కేవలం 15 రోజుల్లో రాత్రి, పగలు కష్టపడి నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇదే ప్రథమ జెండా కావడం స్థానిక మంత్రిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్వాతంత్య్ర సంగ్రామం, దేశభక్తి గురించి తెలియజేయాలనే ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తు చేసుకోవడంతోపాటు నవభారత నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలనే గొప్ప సంకల్పంతో తొర్రూరులో భారీ జాతీయ పతాకం ఏర్పాటుకు ప్రోత్సాహం అందించినట్లు తెలిపారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి, అందరిలో జాతీయభావాన్ని పెంపొందించారని, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ఐక్యతను చాటామన్నారు. వంద అడుగుల ఎత్తులో పెద్ద జాతీయ జెండా ఆవిషరణ ఈ రోజు తొర్రూరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ.. దేశం కోసం ఆలోచించి ఆహుతైన వారే అమరులవుతారని, దేశం మనకేమిచ్చిందని కాదు.. దేశానికి మనమేమి చేశామన్నదే ముఖ్యమన్నారు. రెండేళ్ల స్వాతంత్య్రోద్యమ జైలు జీవితం, అనేక మంది జాతీయ నాయకులను కలిసి ఎంతో నేర్చుకున్నానని, అనేక ఉద్యమాలకు ఆ జైలు జీవితం ఆదర్శమైందంటూ నేటి తరం విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే ప్రసంగాన్ని ఇచ్చారు.
త్రివర్ణమయమైన తొర్రూరు
వంద అడుగుల ఎత్తులో భారీ జాతీయ జెండాను ఆవిష్కరణతో తొర్రూరు పట్టణం త్రివర్ణమయమైంది. ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తి ఉప్పొంగింది. జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వేలాదిగా పాల్గొన్నారు. వందేమాతరం ఫౌండేషన్ డైరెక్టర్ రవీంద్ర పర్యవేక్షణలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంచాయి. కోయల థింసా ఆదివాసీ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.
జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంలో ప్రత్యేకంగా డ్రోన్‌ను ఏర్పాటు చేసి జెండాపై పూల వర్షం కురిపించిన తీరు ఆకర్షింపచేసింది. సభా ప్రాంగణంలో అమర జవాన్లు, పరమ వీరచక్ర గ్రహీతల చిత్రపటాలను ఏర్పాటు చేయడం జాతీయభావ స్పూర్తిని నింపింది. అనంతరం వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలైన పంచాయతీరాజ్ జట్టుకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో భాగస్వాములైన పాఠశా లల కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులను ప్రత్యేకంగా మంత్రి సత్కరించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్, వీఎంఎఫ్ డైరెక్టర్ టీ రవీంద్ర, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఎంపీపీలు తూర్పాటి చిన్నఅంజయ్య, ఈదురు రాజేశ్వరి, జడ్పీటీ సీలు మంగళపల్లి శ్రీనివాస్, శ్రీరాం జ్యోతిర్మ యి, పీఏ సీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, రైతుబంధు సమి తి జిల్లా సభ్యుడు రామసహాయం కిశోర్‌రెడ్డి, ఆర్డీవో ఎల్ రమేశ్, తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, కమిషనర్ గుండె బాబు, సీఐ వై సత్యనారాయణ, టీఎస్ ఈజీఎస్ కౌన్సిల్ మెంబర్ ఎల్ వెంకటనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మ న్ పసుమర్తి శాంత, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జిను గ సురేందర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఇట్టే శ్యాంసుందర్‌రెడ్డి, మండ ల, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ ఎస్ నాగవా ణి, ఎంపీడీవో ఎస్ కుమార్, ఎస్సై సతీశ్, పాఠశాల హెచ్ఎం శ్రీనుబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రతిష్ఠాపన కమిటీ ప్రతినిధులు శామకూరి ఐలయ్య, దొంగరి శంకర్, బిజ్జాల అనిల్, కుర్ర శ్రీనివాస్, ధరావత్ జైసింగ్‌నాయక్, చీకటి శ్రీనివాస్‌గౌడ్, కందాటి అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.