రైతుల ఆర్థిక స్వావలంబనే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కారు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని ప్రోత్సహిస్తున్నది. ఈ క్రమంలో ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించింది. జిల్లాలో 57,795 ఎకరాల భూములు అనువైనవిగా గుర్తించింది. తొలి విడుత 10,230 ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది రూ.38.04 కోట్లు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, బ్యాంకు ద్వారా దీర్ఘకాల రుణాలూ పొందేందుకు ఏర్పాట్లు చేసింది. సంగెం మండలం రామచంద్రాపురం గ్రామం వద్ద 70 ఎకరాల్లో పెరుగుతున్న 6 లక్షల ఆయిల్‌పామ్ మొక్కల పంపిణీని షురూ చేసింది. ఆదివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్వతగిరిలోని తన సొంత వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును లాంఛనంగా ప్రారంభించారు.
వరంగల్, ఆగస్టు 21(నమస్తేతెలంగాణ) : రైతు పక్షపాతిగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నది. రాయితీలు అందజేస్తూ వారికి దన్నుగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు మొక్కలతో పాటు ఎరువులు, అంతర పంటలు, బిందు సేద్యం కోసం రాయితీలు ఇచ్చేందుకు నిర్ణయించింది. జిల్లాలో ఈ ఏడాది 10,230 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు రూ.38.04 కోట్ల రాయితీలు ఇవ్వనుంది. ఈ మేరకు ఉద్యానశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
జిల్లాలో 57,795 ఎకరాల విస్తీర్ణం ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలమైనదిగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10,230 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయలని లక్ష్యంగా నిర్దేశించింది. ఆయిల్‌పామ్ చట్టం-1993 ప్రకారం జిల్లాను రామ్‌చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్‌కు కేటాయించింది. నర్సరీ స్థాపించడం మొదలుకుని మొక్కలు, తోటలు పెంచడం, ఫ్యాక్టరీని నెలకొల్పడం, రైతుల నుంచి ఆయిల్ పామ్ గెలలను కొనడం వరకు పూర్తి బాధ్యత ఈ కంపెనీదే. ఇందులో భాగంగా రామ్‌చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ సంగెం మండలం రామచంద్రాపురం గ్రామం వద్ద 70 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు చేసింది.
సుమారు 6 లక్షల మొక్కలను ఈ నర్సరీలో పెంచుతున్నట్లు ఉద్యానశాఖ అధికారి శంకర్ తెలిపారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్న రైతుల్లో ఇప్పటివరకు 3,086 మంది తమ పేర్లను ఉద్యానశాఖ అధికారుల వద్ద నమోదు చేసుకున్నారు. ఆయిల్‌పామ్ రైతులకు మొక్కలు నాటడానికి ముందే బిందు సేద్య పరికరాలను సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 933 మంది రైతులు బిందు సేద్య పరికరాల కోసం మీసేవ కేంద్రాల ద్వారా పేర్లు నమోదు చేసుకున్నారు. 1,129 ఎకరాలకు బిందు సేద్య పరికరాలకు అవసరమైన పాలనాపరమైన అనుమతులు ఇచ్చినట్లు శంకర్ వెల్లడించారు. రైతులు బిందు సేద్యం పరికరాలు, ఆయిల్ పామ్ మొక్కల కోసం తమ వాటాధనం కూడా చెల్లిస్తున్నారు.
రాయితీలు కల్పించిన ప్రభుత్వం..
ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పించింది. ఒక మొక్కకు రైతులు తమ వాటా కింద రూ.20 చెల్లిస్తే ప్రభుత్వం రూ.193 చొప్పున ఒక ఎకరంలో నాటే మొక్కలపై రూ.11,600 రాయితీ ఇస్తుంది. ఇలా ఈ ఆర్థిక సంవత్సరం 10,230 ఎకరాలకు మొక్కలపై రాయితీ రూ.11.86 కోట్లు ఇవ్వనుంది. ఎరువులపై ఎకరానికి రూ.2,100 లెక్కన రూ.2.14 కోట్లు అందజేయనుంది. అంతర పంటలపై ఎకరానికి రూ.2,100 చొప్పున రూ.2.14 కోట్లు ఇవ్వనుంది. ఇక బిందు సేద్యంపై ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం.. సన్న, చిన్నకారు, వెనుకబడిన తరగతుల రైతులకు 90, ఇతరులకు 80 శాతం రాయితీ ఇచ్చేందుకు నిర్ణయించింది.
బిందు సేద్యం పరికరాల విలువ ఎకరానికి రూ.21,386 అధికారులు అంచనా వేశారు. ఈ లెక్కన బిందు సేద్యం కోసం ప్రభుత్వం రూ.21.87 కోట్లు ఇవ్వనుంది. ఈ ఏడాది జిల్లాలో నిర్దేశిత 10,230 ఎకరాల్లో ఆయిల్‌పామ్ తోటల సాగుకు రాయితీ రూ.38.04 కోట్లు అవసరమని ఉద్యానశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. రైతులకు ప్రభుత్వం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా నాలుగేళ్ల మారటోరియంతో దీర్ఘకాల రుణాలు ఇప్పించేందుకూ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అందుబాటులో ఉన్న రాయితీ విధానం, బ్యాంకు రుణ సౌకర్యంలో రైతులు ఏ పద్ధతినైనా ఎంచుకునే అవకాశం కల్పించింది.
అలాగే, జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు రామచంద్రాపురం నర్సరీ నుంచి మొక్కలు పంపిణీ చేయడం ప్రారంభమైంది. పర్వతగిరిలోని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం ఆయిల్‌పామ్ మొక్కలు నాటడం ద్వారా జిల్లాలో వీటి పంపిణీని ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు ఇక నుంచి రామచంద్రాపురం నర్సరీలోని మొక్కలను ఫిబ్రవరి వరకు నిర్దేశిత లక్ష్యం ప్రకారం పంపిణీ చేయనున్నట్లు ఉద్యానశాఖ అధికారి శంకర్ చెప్పారు. ఇప్పటికే బిందు సేద్యం పరికరాలను పొందిన రైతులకు సోమవారం నుంచి మొక్కలు అందజేస్తామని తెలిపారు.