నర్సంపేట రూరల్, ఆగస్టు 11: రాఖీ పండుగంటేనే అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానుబంధానికి ప్రతీక. ఎక్కడెక్కడో ఉండే సోదరీమణులు తమ ప్రేమకు, అభిమానానికి గుర్తుగా తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తారు. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది, చేతికి ప్రేమగా రాఖీ కట్టి, మిఠాయి తినిపిస్తారు. సోదరులు తమ శక్తికొద్దీ కానుకలిస్తారు. ఒకరికొకరు తీపి తినిపించుకుని తమ అనుబంధాన్ని పంచుకుంటారు.
పండుగ విశిష్టత..
ఏటా శ్రావణ పౌర్ణమి రోజు రక్షాబంధన్(రాఖీ) పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. రాఖీ పండుగపై పలు రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. అలెగ్జాండర్ చక్రవర్తితో ఆ కాలంలో జరిగిన యుద్ధంలో పురుషోత్తముడనే రాజు ఓటమి పాలవుతాడు. అతడిని బంధీ చేసి తీసుకువెళుతున్న సమయంలో ఆయన భార్య రాణి సంయుక్త అలెగ్జాండర్ వద్దకు వెళ్లి చేతికి రాఖీ కడుతుంది. దీంతో సంయుక్తను చెల్లెలుగా భావించి అలెగ్జాండర్ ఏం కావాలో కోరుకోమంటే తన భర్త పురుషోత్తముడిని బంధ విముక్తుడిని చేయాలని వేడుకుంటుంది. వెంటనే పురుషోత్తముడిని విడుదల చేసి సంయుక్తకు విలువైన కానుకలు ఇచ్చి అలెగ్జాండర్ వెళ్లిపోతాడు. దీనిని బట్టి అప్పటికే రాఖీ పండుగ ఉందని పలువురు చెబుతారు. అలాగే, దుష్టశక్తులను పారదోలడానికి యుద్ధంలో విజయం సాధించడానికి రక్షా బంధన్ ధరించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు కూడా ఓ కథ ప్రచారంలో ఉంది. ఏదైనా కార్యక్రమం నిర్వహించ తలపెట్టినప్పుడు రక్షను ధరించడం హైందవ ఆచారం. ఆ కార్యక్రమం ఏ విఘ్నాలు లేకుండా సజావుగా సాగాలని, అనుక్షణం లక్ష్యం గురించి గుర్తు చేసేందుకు ఈ రక్షను ధరిస్తారు. వివాహం, యజ్ఞయాగాదులు, వ్రతాలు, నోములు వంటి కార్యక్రమాల్లో ఈ రక్షధారణ తప్పనిసరిగా ఉంటుంది. పూర్వకాలంలో యుద్ధానికి వెళ్లే భర్తలకు భార్యలు, సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ సోదరీమణులు రక్షలు కట్టేవారు. కాలక్రమేణా రక్షను సోదర ప్రేమకు చిహ్నంగా కట్టే విధానం వచ్చింది. ఈ రక్షను కట్టడంలో ముఖ్య ఉద్దేశం..వారి క్షేమాన్ని కోరడమే.
కొనుగోళ్లతో సందడిగా మార్కెట్లు
కాలానుగుణంగా రాఖీలు కొత్త కొత్త డిజైన్లలో వస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి విక్రయాలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాకేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో భారీగా దుకాణాలు వెలిశాయి. వారం ముందు నుంచే అమ్మకాలు జోరందుకున్నాయి. గతంలో రెండు, మూడు షాపులు మాత్రమే ఉండగా వీధివీధికో చిన్న స్టాళ్లు వెలిశాయి. పండుగ సందర్భంగా మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. రాఖీ స్టాల్స్‌తో పాటు స్వీట్‌హౌస్‌లు, ఇతర దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.