మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 1 : గిరిజనుల సంస్కృతి, ఆచారాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తమ తండాల్లో నిర్వహించే పురాతన విధానాలకు పెద్దపీట వేస్తున్నారు. అనాదిగా గిరిజనులు సంప్రదాయంగా నిర్వహిస్తున్న పండుగల్లో తీజ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ తీజ్‌ను కేవలం తండాల్లో పెండ్లి కాని గిరిజన యువతులు మాత్రమే నిర్వహిస్తుంటారు. అనాదిగా తండాల్లో వస్తున్న తమ ఆచార, సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా శ్రావణమాస ప్రారంభం, వ్యవసాయ పనుల తీరిక వేళలో నిర్వహిస్తున్నారు. తండాలోని పెద్ద సహాయంతో పది రోజుల ముందుగానే యువతులందరు కలిసి పండుగకు సిద్ధమవుతారు.
పెద్ద సూచనల మేరకు పండుగ జరుపుకొనే రోజును యువతులందరు కలిసి నిర్ణయించుకుంటారు. యువతులు వారి సోదరులతో కలిసి అడవికి వెళ్లి పుట్టమన్ను సేకరిస్తారు. ఆ పుట్ట మన్నును ఇంటికి తెచ్చి వెదురు దుసురు తీగలతో బుట్టలు అల్లి పుట్ట మన్నులో గోధుమ గింజలను వేస్తారు. ఇలా చేసిన బుట్టలను తండా పెద్ద ఇంటి ఎదుట ఏర్పాటుచేసిన మంచెపై పెడుతారు. గోధుమ గింజలు ఉన్న వెదురుబుట్టలపైన మొలకలు వచ్చే వరకు తొమ్మిది రోజుల పాటు నీళ్లు పోస్తారు. మొలకలు వచ్చిన తర్వాత తండా సమీపంలో ఉన్న వాగుల్లో నిమజ్జనం చేస్తారు. తమ జీవితంలోకి మంచి భాగస్వామి రావాలని, తండాకు మంచి జరగాలని, అందరు బాగుండాలనే ఉద్దేశంతో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. గిరిజనుల ఆరాధ్యదైవం అయిన సేవాలాల్, మేరమ్మకు పూజలు చేస్తారు.
ఈ తొమ్మిది రోజులు గిరిజనులు ఎక్కడ ఉన్నా తమ సొంత గూటికి చేరుకుంటారు. ఉత్సవాల్లో పాల్గొనే యువతులు తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం బుట్టలకు నీరు పోస్తారు. 8వ రోజులు పెండ్లి కాని యువతులందరు ఒక చోట చేరి పుట్ట మన్ను అబ్బాయి, అమ్మాయి బొమ్మలను తయారు చేసి వాటిని తండాల్లో ఉన్న ఆలయం వద్ద ఉంచి పూజలు చేస్తారు. అనంతరం తండా వాసులు వంటకాలతో భోజనం చేస్తారు. తొమ్మిదో రోజు గిరిజన వేషధారణలో దుస్తులు, ఆభరణాలు ధరించి తండా పెద్ద ఇంటి వద్దకు చేరుకుంటారు. అక్కడ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. సాయంత్రం వేళ డప్పుచప్పుళ్లతో వెళ్తుండగా బంధువులు కానుకలు అందచేస్తారు. యువతులు ప్రతిఫలంగా గోధుమ మొలకలు ఇస్తారు.
యువతులకు ప్రత్యేక నమ్మకం
తండాల్లో తాము అనుకున్న కోరికలు తీరుతాయని తీజ్ పండుకపై ప్రత్యేక నమ్మకంతో ఉంటాం. ప్రతి సంవత్సరం తండాలో ఉన్న వారందరు ఒక్కటిగా జరుపుకొనే పండుగ ఇది. తీజ్ వేడుకంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. చెరువు నుంచి మట్టి తెచ్చిన దగ్గర నుంచి గోధుమలు మొలకలు వచ్చే వరకు ప్రతి ఒక్కరు నిష్టతో ఉంటారు.
– డి.జాబిల్లి, గుండ్లబోడుతండా