హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 1 : తెలంగాణలోని ప్రాచీన కట్టడాలపై కేంద్ర ప్రభుత్వ వివక్ష చూపుతుందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సోమవారంమ వేయిస్తంభాల ఆలయంలోని కల్యాణ మండపాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిలిచి పోయిన కల్యాణ మండప పనుల జాప్యంపై చర్చించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి అందించడంతోనే నిధులు మంజూరయ్యాయన్నారు. 16 సంవత్సరాల్లో తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన కట్టడాలను కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రామప్పను యునెస్కోలో చేర్చడంలో సీఎం కేసీఆర్ కృషి చేశారని గుర్తుజేశారు. మహబూబ్‌నగర్‌లోని జోగులాంబ ఆలయానికి, ములుగులోని రామప్ప ఆలయాలను కేంద్ర పురావస్తు శాఖ ప్రసాదం పథకంలో చేర్చి నిధులు కేటాయించిదని, ఈ ప్రసాద పథకంలో వేయిస్తంభాల గుడిని చేర్చడంతో అభివృద్ధి జరగడమే కాకుండా ప్రపంచ వారసత్వసంపదగా గుర్తింపు వస్తుందన్నారు.
పురావస్తుశాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడనాడి సమన్వయంతో పని చేసి మండపాన్ని పూర్తి చేయాలన్నారు. లేకుంటే టీఆర్ఎస్ ఎంపీల ద్వారా పార్లమెంట్లో పోరాడి తీసుకువస్తామని త్వరగా పూర్తిచేయడంతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇంకా సినిమా షూటింగ్‌లకు అవకాశం ఏర్పడుతుందని వినయ్‌భాస్కర్ తెలిపారు. అంతకుముందు వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామికి చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్-రేవతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సోమవారం శ్రావణమాసంలో నిర్వహించే అలంకరణ కోసం రూ.16 వేలు కార్యనిర్వహణాధికారికి అందజేశారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మాడిశెట్టి శివశంకర్, కోన శ్రీకర్, పాల్గొన్నారు.