కాశీబుగ్గ/వర్ధన్నపేట/ఖానాపురం, జూలై 20: వరంగల్ వ్యవసాయ కళాశాల దత్తత గ్రామమైన కొత్తపేటలో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగును బుధవారం చేపట్టారు. కేఎన్ఎం-1638 రకం మొలకెత్తిన వరి విత్తనాలను దమ్ము చేసిన పొలంలో విత్తారు. కూలీల కొరత, సాగు ఖర్చు పెరిగిన దృష్ట్యా వ్యవసాయ కళాశాల సహకారంతో రైతు నేరెళ్ల సురేంద్రరెడ్డి విన్నూతంగా ఈ పద్ధతిలో సాగు చేస్తున్నాడు.
దీనివల్ల 7 నుంచి 10 రోజుల ముందుగానే పంట కోతకు రావడమే కాకుండా సాగు ఖర్చు తగ్గుతుందని అధికారులు తెలిపారు. వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన దేవేందర్‌రావు వ్యవసాయ క్షేత్రంలో వెదజల్లే పద్ధతిలో వరి సాగు విధానంపై ఏవో రాంనర్సయ్య రైతులకు అవగాహన కల్పించారు. ప్రధానంగా చెరువుల కింద ఈ విధానాన్ని అన్నదాతలు విధిగా పాటించాలని కోరారు. ఖానాపురం మండలంలోని ఖానాపురం, చిలుకమ్మనగర్లో ఏవో శ్రీనివాస్ డ్రమ్‌సీడర్ సాగుపై రైతులకు వివరించారు. ఆయన వెంట ఏఈవో సంధ్య ఉన్నారు.
పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు
దుగ్గొండి/నల్లబెల్లి/చెన్నారావుపేట: పంటల సాగుకు ముందు భూమిలో పచ్చిరొట్ట సాగు చేస్తే భూ సారం పెరిగి సారవంతం అవుతుందని దుగ్గొండి ఏవో చిలువేరు దయాకర్ అన్నారు. తొగర్రాయికి చెందిన ఆవుల నర్సింహారెడ్డి పచ్చిరొట్ట సాగు చేయగా, వ్యవసాయ క్షేత్రాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. ఏఈవో మధు శివాజీనగర్, తొగర్రాయి రైతులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం నారక్కపేటలో వ్యవసాయాధికారు లు పంట క్షేత్రాలను పరిశీలించారు. ముందుగా భూ మిలో పచ్చిరొట్ట సాగు చేసుకొని కలియదున్నితే అన్నదాతలు అధిక దిగుబడి సాధిస్తారని ఏవో పరమేశ్వర్ తెలిపారు.
ఆయన వెంట ఏఈవో వినూష ఉన్నారు. చెన్నారావుపేట మండలం అమీనాబాద్, ఖాదర్‌పేటలో వ్యవసాయాధికారులు పంటల నమోదును ప్రారంభించారు. నర్సంపేట వ్యవసాయ సహాయ సం చాలకుడు అవినాష్‌వర్మ అమీనాబాద్‌లో పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఖదర్పేటలోని రైతులతో మాట్లాడారు. కలుపు, తెగుళ్ల నివారణపై వివరించారు. ఆయన వెంట ఖాదర్‌పేట సర్పంచ్ అనుముల కుమారస్వామి, ఎంపీటీసీ శ్రీను, ఉపసర్పంచ్ రాజు, గొల్లపల్లి సర్పంచ్ రమేశ్, ఏవో అనిల్ ఉన్నారు.