వరంగల్, జూలై 10 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో వాన దంచికొడుతోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తుండడంతో లోతట్టు, ముంపు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సంగెం మండల కేంద్రంలో ఆదివారం ఒక ఇల్లు కూలిపోయింది. శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతుండడంతో వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీగా వరదనీరు చేరుతుండడంతో కొన్ని చెరువులు అలుగుపోస్తున్నాయి. పాకాల సరస్సు నీటిమట్టం 21.5 అడుగులకు చేరింది. జిల్లా సగటు వర్షపాతం 4.7 సెంటీమీటర్లుగా నమోదైంది. ప్రస్తుత వానకాలం జిల్లాలో ఇప్పటి వరకు రైతులు 1,11,239 ఎకరాల్లో పత్తి, 5,588 ఎకరాల్లో మక్కజొన్న, 1,412 ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేశారు. కలెక్టర్ బీ గోపి వర్షం, నష్టాలపై తాసిల్దార్లు, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో జన జీవనం స్తంభించింది. శనివారం రాత్రి నుంచి వాన దంచికొడుతుండంతో వాగులు, ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొన్ని చెరువులు నీటితో నిండి అలుగు పోస్తున్నాయి. కల్వర్టులు, కాజ్‌వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో మారుమూల గ్రామాలకు కొన్నింటికి రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు కూలడంతో పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఏకధాటిగా వాన పడుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.జిల్లా వ్యాప్తంగా 56.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఖానాపురం మండలంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మండలా వారీగా నల్లబెల్లిలో 7.5, వరంగల్‌లో 5.3, దుగ్గొండిలో 5.2, నర్సంపేటలో 4.7, పర్వతగిరిలో 4.5, గీసుగొండలో 4.08, సంగెంలో 3.76, చెన్నారావుపేటలో 3.68, నెక్కొండలో 3.36, రాయపర్తిలో 2.84, వర్ధన్నపేటలో 2.26 సెంటీమీటర్ల వర్షం పడింది. జిల్లా సగటు వర్షపాతం 4.7 సెంటీమీటర్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం ముసురు ముంచెత్తడంతో జిల్లా అతలాకుతలమైంది. సంగెం మండల కేంద్రంలో ఒక ఇల్లు కూలిపోయింది. పంటల్లో వరద నీరు నిలిచిపోయింది.
ప్రస్తుత వానకాలం జిల్లాలో ఇప్పటి వరకు రైతులు 1,11,239 ఎకరాల్లో పత్తి, 5,588 ఎకరాల్లో హక్కజొన్న, 1,412 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఈ పంటలు మొక్క దశలోనే నీటమునిగాయి. తమ పంటల్లో నిలిచిన వరద నీటిని బయటకు పంపేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు నీటి మట్టం ఆదివారం వరకు 21.5 అడుగులకు చేరింది. రోజురోజుకు సరస్సులో నీటిమట్టం పెరుగుతుండటంతో రైతులు మురిసిపోతున్నారు. పాకాల కింద ఈ వానకాలం వరి పంట సాగుకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలోని ఇతర చెరువుల్లోకీ వరద నీరు చేరుతుండడంతో వీటి కింద ఆయకట్టు గల రైతులు వరి నారు పోసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
అధికారులు అప్రమత్తం..
ఏకధాటి వర్షాలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. స్వయంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వర్షాలపై ఆదివారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఎడతెరిపి లేకుండా వాన పడుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ బీ గోపి, డీసీపీ వెంకటలక్ష్మితో పాటు ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. వర్షాలు, ప్రాణ నష్టం కలుగకుండా తీసుకుంటున్న చర్యలపై సీఎస్ సోమేశ్‌కుమార్ ఆరా తీశారు. ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం వాటిల్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వర్షాల వల్ల పాఠశాలలకు సోమవారం నుంచి బుధవారం వరకు ప్రభుత్వం మూడు రోజుల సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. అనంతరం కలెక్టర్ బీ గోపి జిల్లాలో వర్షం, నష్టాలపై తాసిల్దార్లు, ఇతర అధికారులతో సమీక్ష జరిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. చెరువుల పరిస్థితిపై జలవనరుల శాఖ ఇంజినీర్లతో మాట్లాడారు. నీటితో నిండుతున్నందున చెరువుల కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజినీర్లకు చెప్పారు. వర్షాల దృష్ట్యా కాకతీయ వైభవ సప్తాహం సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళా ప్రదర్శన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ గోపి ప్రకటించారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు బయటకు వచ్చి ప్రదర్శనలను వీక్షించడం సాధ్యం కాదని, వేదిక ప్రాంతమంతా కూడా నీటిమయంగా మారిందని ఆయన తెలిపారు. ఈ ప్రదర్శనలు మళ్లీ ఎప్పుడు ఉంటాయనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని కలెక్టర్ వెల్లడించారు. నర్సంపేట నియోజకవర్గం పరిధిలో వర్షాలు, నష్టాలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మాట్లాడారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.