ఖిలావరంగల్, జూలై 9 : జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బీ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్థం 0870-2540345, 9154252936 టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం పొందొచ్చన్నారు. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వాగులు, వంకలు పొంగి పొర్లే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని పేర్కొన్నారు.
జిల్లాలో 5.23 సెంటీమీటర్ల వర్షపాతం..
జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం జిల్లాలో 5.23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సీపీవో జీవరత్నం తెలిపారు. గీసుగొండ మండలంలో 36.4మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 57.4, నల్లబెల్లిలో 90.6, నర్సంపేటలో 55.6, ఖానాపురంలో 77.2, చెన్నారావుపేటలో 101.6, సంగెంలో 36.8, వర్ధన్నపేటలో 33.8, రాయపర్తిలో 35.8, పర్వతగిరిలో 39.8, నెక్కొండలో 36.4, వరంగల్లో 26.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా చెన్నారావుపేటలో అత్యల్పంగా వరంగల్లో వర్షం కురిసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా లోతట్టు ప్రాంతాల్లోని డ్రైనేజీలు, కాల్వలను బల్దియా కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఖిలావరంగల్ రాతికోట అగడ్తకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అగడ్త తూము నుంచి శివనగర్ వైపు వరద నీరు ప్రవహిస్తోంది. శివనగర్, ఖిలావరంగల్ ప్రాంతాలతో పాటు విలీన గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
కరంట్తో జరభద్రం..
చెన్నారావుపేట : రైతులు, ప్రజలు కరంట్తో జర భద్రంగా ఉండాలని మండల విద్యుత్ అధికారి రామకృష్ణ సూచించారు. మండల వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వానలకు విద్యుత్ సమస్యలు తలెత్తితే సొంతంగా రిపేరు చేయొద్దని, లైన్మెన్ లేదా అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాగే గాలి వానలకు విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉంటుందని, రైతులు, గొర్లు, బర్ల కాపరులు తమ పనులకు వెళ్లే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. గృహాల్లో చిన్న పిల్లలను విద్యుత్ పరికరాలకు దూరంగా ఉంచాలని, ఆరుబయట ఇనుప స్తంభాలుంటే వాటికి విద్యుత్ తీగలు తగలకుండా చూసుకోవాలన్నారు.