ఓరుగల్లు అట్టుడికింది.. పెద్దపెట్టున ‘మోదీ డౌన్‌డౌన్.. రాకేశ్ అమర్ రహే’ నినాదాలతో దద్దరిల్లింది. ఎంజీఎం వైద్యశాల నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట దాకా సుమారు 60 కిలోమీటర్ల మేర ఆర్మీ ఉద్యోగార్థి దామెర రాకేశ్ అంతిమయాత్ర ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగింది. సైనిక నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళనలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్‌కు వేలాది మంది ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు.
ఎంజీఎం మార్చురీ వద్ద రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపునేని నరేందర్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రెడ్యానాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు రాకేశ్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో స్వగ్రామం దబీర్‌పేట దాకా అంతిమయాత్ర తీశారు. యాత్రలో అడుగడుగునా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను యువకులు, టీఆర్ఎస్ శ్రేణులు దహనం చేసి కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా గళమెత్తారు. ‘అగ్నిపథ్’ను వెంటనే రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాకేశ్ మృతికి నిరసనగా నర్సంపేట నియోజకవర్గంలో చేపట్టిన బంద్‌లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

సైనిక నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన ఆందోళనలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన దామెర రాకేశ్‌కు వేలాది మంది ప్రజలు, టీఆర్ఎస్ నాయకులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఉదయం 10.30 గంటలకు ఎంజీఎం మార్చురీ నుంచి రాకేశ్ అంతిమయాత్ర ప్రారంభం కాగా, నగర ప్రధాన రహదారుల మీదుగా వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేట వరకు ఉత్కంఠగా.. ఉద్విగ్నభరితంగా సాగింది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి యువకులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. ఉదయం 8గంటలకే ఎంజీఎం మార్చురీ ప్రాంతం వేలాది మందితో నిండిపోయింది. ఇక్కడ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాకేశ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాత్ర సమయంలో నగర రహదారులు కిక్కిరిసిపోయాయి.

రాకేశ్ అంతిమయాత్రలో పాల్గొన్నవారితో నర్సంపేట పట్టణం జనసంద్రాన్ని తలపించింది. ఇక్కడ అమరవీరుల స్తూపం వద్ద రాకేశ్ చిత్రపటాన్ని ఉంచి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎంపీ కవిత నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించారు. అగ్నిపథ్ లాంటి పథకాన్ని వెంటనే రద్దు చేయాలని, రాకేశ్ మృతికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

రాకేశ్ మృతికి నిరసనగా ఎమ్మెల్యే పెద్ది పిలుపుమేరకు నిర్వహించిన నర్సంపేట నియోజకవర్గ బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌లో పాల్గొన్నాయి. కిరాణా దుకాణాలు, బ్యాంకులు, బంక్‌లు, సినిమా థియేటర్, రైస్ మిల్లులు, షాపింగ్‌మాళ్లు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. రాకేశ్ అంతిమయాత్ర, అంత్యక్రియల్లో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జనగామ జడ్పీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

రాకేశ్ పార్థివదేహం మధ్యా హ్నం 1.30 గంటలకు దబీర్‌పేట కు చేరుకోగా ఒక్కసారిగా గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి పూలమ్మ కొడుకు మృతదేహంపై పడి ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ఎంపీలు కవిత, దయాకర్, చీఫ్‌విప్ దాస్యం, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సీతక్క దబీర్‌పేటకు చేరుకొని అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. భారీ జన సందోహం నడుమ మధ్యాహ్నం 2.45 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కాగా, ఎమ్మెల్యే పెద్ది, ఎమ్మె ల్సీ పల్లా మొదటి నుంచి చివరి వరకు కార్యకర్తలతో కలిసి నడిచా రు. మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యువకుడు రాకేశ్ పాడెను మోశారు. 5.40గంటలకు చితికి తండ్రి కుమారస్వామి నిప్పటించారు. అనంతరం మంత్రి ఎరబెల్లి మాట్లాడుతూ రాకేశ్ పేరిట దబీర్పేటను దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
అనుక్షణం ఉత్కంఠ
రాకేశ్‌కు అంతిమ వీడ్కోలు పలికేందుకు వేలాది మంది తరలిరావడంతో ఏక్షణం ఏం జరుగుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ స్కీం కారణంగా జరిగిన ఆందోళనల్లో రాకేశ్ బలికావడం ఉమ్మడిజిల్లావాసుల్లో ఆగ్రహం తెప్పించింది. కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్లే రాకేశ్లాంటి యువకుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని, అన్యాయంగా రాకేశ్ ప్రాణాలు కోల్పోయాడని ప్రతి ఒక్కరూ బీజేపీ సర్కారు తీరుపై మండిపడ్డారు. అంతిమయాత్రను చూసేందుకు నగర ప్రజలు దారుల వెంట బారులు తీరారు. వాహనంపై యువకుడి తల్లి, తండ్రి, సోదరి గుండెలు బాదుకుంటూ ఏడ్చిన తీరు ప్రతిఒక్కరినీ కలిచివేసింది

రాకేశ్ అంతిమయాత్ర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎంజీఎం మార్చురీ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. యాత్ర సాగే రహదారులు, కూడళ్ల వద్ద పటిష్ట బందోబస్తు కల్పించారు. పోచమ్మమైదాన్ సెంటర్లోని బీఎస్ఎన్ఎల్ ఎకేంజ్ కార్యాలయంపై దాడికి ప్రయత్నించిన వారిని అడ్డుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూశారు.

రాకేశ్ అంతిమయాత్రలో ప్రధాని నరేంద్ర మోదీపై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడ్డాయి. అడుగడుగునా మోదీ దిష్టిబొమ్మలను యువకులు, టీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. ‘మోదీ డౌన్ డౌన్.. రాకేశ్ అమర్హ్రే’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎంజీఎం సర్కిల్లో 29వ డివిజన్ టీఆర్ఎస్ నాయకుడు సదాంత్, పోచమ్మమైదాన్ సెంటర్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కాశీబుగ్గ సెంటర్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.