కాజీపేట, జూన్ 18 : కాజీపేట రైల్వే జంక్షన్లో శనివారం అధికారులు హై అలర్డ్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి శనివారం సాయంత్రం కాజీపేట రైల్వే జంక్షన్‌ను సందర్శించి బందోబస్తును పరిశీలించారు. రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సంజీవరావును బందోబస్తు, రైళ్ల రాకపోకల పరిస్థితి, ప్రయాణికుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.
రైల్వే జంక్షన్‌లోని పలు కార్యాలయాలు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, ప్ల్లాట్ఫారాలను డాగ్‌స్కాడ్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేయించారు. అదే సమయంలో వచ్చిన సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ ఇంటర్సిటీ రైలు బోగీల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. రైల్వే స్టేషన్‌కు వచ్చి పోయే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టాలని తెలిపారు. అనంతరం అర్పీఎఫ్ ఐజీ అరుల్ జ్యోతితో నగర పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి సమావేశమయ్యారు. ఆయన వెంట కాజీపేట సీఐ మహేందర్‌రెడ్డి, జీఆర్పీ సీఐ రామ్మూర్తి, ఎస్సైలు అపూర్వారెడ్డి, వెంకటేశ్వర్లు, అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు.
రీషెడ్యూల్‌తో ఆలస్యంగా నడిచిన రైళ్లు…
రైల్వే అధికారులు పలు రైళ్లను రీషెడ్యూల్ చేసి గంటల ఆలస్యంతో కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడిపించారు. మణుగూరు, తెలంగాణ, దానాపూర్ ఎక్స్‌ప్రెస్‌తోపాటు పలురైళ్లు ఆలస్యంగా నడిచినట్లు అధికారులు వివరించారు. కాజీపేట రైల్వే జంక్షన్, టౌన్ స్టేషన్లలో రైల్వే అధికారులు షిర్డీ, గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను శనివారం అరగంట పాటు నిలిపివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కాల్పుల ఘటనలో రాకేశ్ అనే యువకుడు మృతిచెందాడు. నగరంలోని ఎంజీఎం మార్చురీ నుంచి రాకేశ్ స్వగ్రామానికి శవయాత్ర నిర్వహిస్తున్న క్రమంలో కొందరు వరంగల్ రైల్వే స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును టౌన్ రైల్వే స్టేషన్, షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు కాజీపేట రైల్వే జంక్షన్లో అరగంట పాటు నిలిపి వేశారు. నగరం నుంచి రాకేశ్ శవయాత్ర వెళ్లిన తర్వాత ఆపిన రైళ్లను పంపించారు.