మహబూబాబాద్, జూన్ 18 : అక్రమంగా నిల్వ ఉంచిన 150 బస్తాలు (75 క్వింటాళ్ల) నల్లబెల్లం, రెండు క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మహబూబాబాద్ మండలం అయోధ్య శివారులోని భజనతండాకు చెందిన వాంకుడోత్ వీరేందర్ కొన్ని నెలలుగా నల్లబెల్లం వ్యాపారం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూ రు జిల్లాలో బెల్లం రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి మండల పరిధిలోని గుడుంబా తయారు చేసే వారికి ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. శుక్రవారం భజనతండా లో నల్లబెల్లం, పటిక దిగుమతి చేసుకున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు చేపట్టామని, 75 క్వింటాళ్ల నల్లబెల్లం, 2క్వింటాళ్ల పటికను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వీరేందర్ పరారయ్యాడని, త్వరలోనే పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామన్నారు.
ఆరు నెలల్లో మూడు కేసులు
నల్లబెల్లం వ్యాపారి వీరేందర్‌పై ఆరు నెలల్లో రూరల్ సర్కిల్ పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయని సీఐ తెలిపారు. కేసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, కురవి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి, ప్రస్తుతం మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నల్లబెల్లం వ్యాపారిపై పీడీయాక్టు నమోదు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నామని చెప్పారు. ఎక్సైజ్ శాఖలోనూ వీరేందర్‌పై కేసులున్నట్లు తెలుస్తోందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ ఎస్సై సీహెచ్ అరుణ్‌కుమార్, ఏఎస్సై ఆనందం, సిబ్బందిని సీఐ రవికుమార్ అభినందించారు.