వరంగల్ చౌరస్తా, జూన్ 18 : రక్త సేకరణలో వరంగల్ ఎంజీఎం దవాఖాన బ్లడ్ బ్యాంకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే, ఎక్కువ రక్తదానం చేయించిన ఎన్జీవోగా యువ నేతాజీ ఫౌండేషన్‌కు రాష్ట్రస్థాయి అవార్డు వచ్చింది. కాగా, రక్తదాతల దినోత్సవం సందర్భంగా జూన్ 14న హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై, గాంధీ హాస్పిటల్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఎంజీఎం దవాఖానలో మదర్ సెంటర్‌గా సేవలు అందిస్తున్న బ్లడ్‌బ్యాంకు ద్వారా గడిచిన సంత్సరకాలంలో 7,136 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. గడిచిన ఆరు నెలల్లో 3,423 యూనిట్ల రక్తాన్ని సేకరించామని ఎంజీఎం వైద్యాధికారులు తెలిపారు. ఎన్జీవో విభాగంలో అవార్డు అందుకున్న ఫౌండేషన్ గడిచిన సంవత్సరకాలంలో 4,326 యూనిట్ల రక్తాన్ని సేకరించింది.
యువత స్వచ్ఛందగా ముందుకు..
– డాక్టర్ ప్రసాద్, ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్ వైద్యాధికారి
రక్తదానం చేసేందుకు యువత ఎక్కువగా ముందు కు వస్తున్నారు. వారి సహకారం వల్లే ఇంతపెద్ద మొత్తం లో రక్తాన్ని సేకరించగలిగాం. ఆపత్కాలంలో బాధితులకు రక్తం అందించి ఆదుకోగల్గుతున్నాం.
మూడు సంవత్సరాలుగా సేకరణ..
– కొత్తకొండ అరుణ్‌కుమార్, యువ నేతాజీ ఫౌండేషన్ అధ్యక్షుడు
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారు, తలసీమియా బాధితుల ప్రాణాలు నిలపడమే లక్ష్యం గా రక్తాన్ని సేకరిస్తున్నాం. మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటివరకు చాలామందికి రక్తాన్ని అందించాం.
ప్లాస్మా దానానికి ప్రత్యేక విభాగం..
– కానిస్టేబుల్ కన్నె రాజు, ఫౌండేషన్ సభ్యుడు
తలసీమియా బాధితులు, క్షతగాత్రులు రక్తం అంద క ప్రాణాలు పోవడాన్ని చూసి తట్టుకోలేకపోయాం. అప్పటి నుంచి నేను, నా మిత్రులు కలిసి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 28 సార్లు రక్తదానం చేశా. కమిషనరేట్‌లో సీపీ రవీందర్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ప్లాస్మా సెంటర్ బాధ్యతలను నాకు అప్పగించారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లోయువ నేతాజీ ఫౌండేషన్‌కు స్థానం..
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్(లండన్)లో యువ నేతాజీ ఫౌండేషన్ స్థానం సాధించింది. శనివారం కలెక్టర్ గోపి చేతుల మీదుగా ఫౌండేషన్ ప్రతినిధులు ఈ అవార్డు అందుకున్నారు. నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టిస్ట్స్ అండ్ ఆక్టివిస్ట్స్ (నిఫా) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ 90వ వర్ధంతిని పురస్కరించుకొని 2021 మార్చి 23న రక్తదాన శిబిరం నిర్వహించారు. కాగా, తెలంగాణలో ఎక్కువ మందితో రక్తదాన చేయించిన యువ నేతాజీ ఫౌండేషన్‌కు ఇంటర్నేషనల్ లైఫ్ సేవర్ అవార్డు వరించింది. ఈ అవార్డును కలెక్టర్ గోపి ఫౌండేషన్ అధ్యక్షుడు కొత్తకొండ అరుణ్‌కుమార్, ప్రతినిధి కన్నె రాజుకు అందజేశారు. కార్యక్రమంలో నిఫా అధ్యక్షుడు యాదవ రాజు, ఫౌండేషన్ ప్రతినిధులు కైలాసపు సంతోష్, బొట్టు కమలాకర్, కోల రాజే శ్, గజ్జెల సుమన్, అల్వాల పృథ్వి, మునిగాల రాంప్రసాద్, ఉప్పరపల్లి రాజ్‌కుమార్, యాద రవి, పాలకుర్తి విష్ణు, కార్తీక్, సభ్యులు పాల్గొన్నారు.