తొర్రూరు, జూన్18 : ప్రభుత్వం రోజుకో నోటిపికేషన్ జారీ చేస్తున్నది.. మీరు కన్న కలలు సాకారం చేసుకునేందుకు ఇదే మంచి తరుణం.. కష్టపడి చదివి కొలువులు సాధించాలి’ అని తొర్రూరు సీఐ సత్యనారాయణ ఉద్యోగార్థులకు సూచించారు. పీఎస్ఆర్ హైస్కూల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్‌ను శనివారం ఆయన ఎస్సై సతీశ్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో ఉన్నత విద్యనభ్యసించిన వారంతా నిజజీవితంలో నిలదొక్కుకునేందుకు ఉద్యోగం ఎంతో కీలకమన్నారు. వేల రూపాయలు ఖర్చు చేసి పట్టణ ప్రాంతాలకు వెళ్లి కోచింగ్ తీసుకునే గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ట్రస్ట్ ద్వారా నిష్ణాతులైన ఆధ్యాపకులతో ఇక్కడ ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారన్నారు. శిబిరంలో శిక్షణ పొందుతున్న వారంతా పట్టుదలతో చదివి లక్ష్యం చేరుకోవాలన్నారు. గతంలో కూడా ఎర్రబెల్లి దయాకర్‌రావు ట్రస్ట్ ద్వారా తొర్రూరు, పాలకుర్తి కేంద్రాల్లో నిర్వహించిన శిబిరాలతో ఎంతోమందికి ప్రయోజనం చేకూరిందని, వందలాది మంది వివిధ శాఖల్లో ప్రభుత్వ కొలువులు సాధించారని గుర్తు చేశారు. ఈ శిబిరంలో శిక్షణ పొందుతున్న వారు కూ డా ప్రతిభను చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో చింగ్ సెంటర్ పరిశీలకురాలు పంజా కల్పన, తొర్రూరు పట్టణ టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు యర్రం రాజు తదితరులు పాల్గొన్నారు.