వరంగల్చౌరస్తా/ఖిలావరంగల్/కరీమాబాద్/గిర్మాజీపేట, జూన్ 15: వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేటలో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమసయలను గుర్తిస్తున్నారు. ఈ సందర్భంగా తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నారు. ఇందులో వరంగల్ 36వ డివిజన్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బందితో కలిసి మురుగు కాల్వను శుభ్రం చేశారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
37వ డివిజన్ గిరిప్రసాద్నగర్లో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించింది. బస్తీ దవాఖాన ఏర్పాటు చేసే స్థలాన్ని కార్పొరేటర్ బోగి సువర్ణా సురేశ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గిరిప్రసాద్నగర్ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్, టీఆర్ఎస్ నాయకులు, కళాకారులు పాల్గొన్నారు. 32, 39, 41, 42వ డివిజన్లో కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు పోశాల పద్మ, గుండు చందన క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
26వ డివిజన్లోని లక్ష్మీపురంలో డ్రైనేజీలు, వీధిలైట్ల సమస్యలను కార్పొరేటర్ బాలిన సురేశ్ ఆధ్వర్యంలో పరిశీలించారు. అలాగే, అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. 25వ డివిజన్ వేణురావుకాలనీలో టీఆర్ఎస్ నాయకుడు బస్వరాజ్ శ్రీమాన్ ఆధ్వర్యంలో నిరుపయోగంగా ఉన్న తాటిచెట్లను తొలగించారు. అలాగే, పక్కనే చెత్తాచెదారంతో నిండిపోయిన ఖాళీ స్థలాన్ని శుభ్రం చేయించారు. అలాగే, 33వ డివిజన్ కార్పొరేటర్ ముష్కమల్ల అరుణాసుధాకర్ ఆధ్వర్యంలో డ్రైనేజీలను శుభ్రం చేయించారు.
వ్యాపారికి రూ. 50 వేల జరిమానా
వర్ధన్నపేట/నర్సంపేట: వర్ధన్నపేటలో దుకాణం ఎదుట చెత్త వేసిన వ్యాపారికి మున్సిపల్ అధికారులు బుధవారం రూ. 50 వేల జరిమానా విధించారు. పట్టణంలోని జాతీయ రహదారి వెంట ఉన్న దుకాణదారుడు విచ్చలవిడిగా ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డుపై వేయడాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ మేరకు రవి క్లాత్స్టోర్ యజమానికి మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్ ఆదేశాల మేరకు రూ. 50 వేల జరిమానా విధించారు. నర్సంపేటలోని మాదన్నపేట పెద్ద కాల్వను జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంప రాజేశ్వర్గౌడ్ శుభ్రం చేయించారు. పట్టణ శుభ్రతను అందరూ పాటించాలని ఆయన కోరారు. కాల్వలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడుతారని తెలిపారు. ము న్సిపల్ సిబ్బందికి చెత్తను అందించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గంప సునీతా రఘునాథ్, మున్సిపల్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ రజిని, ఆర్పీ అనురాధ, శ్రీధర్ పాల్గొన్నారు.