నయీంనగర్, జూన్ 15: కేయూ భూ కమిటీ కన్వీనర్‌ను తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. కేయూ భూకబ్జాల బాగోతాన్ని తేల్చడానికి పాలక మండలి సభ్యులను నియమించారు. భూ కమిటీ కన్వీనర్‌గా కొనసాగుతున్న అశోక్‌బాబు ఇల్లు కేయూ స్థలంలో ఉందని, అతడికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నోటీసులు కుడా జారీ అయినట్లు వీసీ తాటికొండ రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలిపినట్లు సమాచారం. ఇలా అయితే ఏవిధంగా కేయూ భూములను కాపాడుతామని ఓ పాలక మండలి సభ్యుడు రాజీనామా చేసినట్లు తెలిసింది. అశోక్‌బాబు స్థానంలో నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళిని నియమించారు.
న్యాక్ బృందం పర్యటన నేపథ్యంలో అభివృద్ధి పనులు, వసతి గృహాలతోపాటు మరికొన్ని భవనాల మరమ్మతులకు రూ. 80 లక్షలు ఖర్చు అవుతాయని అంచనా వేసి ప్రతిపాదనలు సమర్పించగా, ఆర్థిక కమిటీ, పాలకమండలి అనుమతించింది. పీహెచ్డీ ప్రవేశాల్లో కేటగిరీ-1లో ఫుల్‌టైం వారికే అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. మరమ్మతుల కోసం టెండర్ పిలువాలని, వసతి గృహాలు తెరువాలని కొందరు సభ్యులు కోరారు. పాలకమండలి సభ్యులు రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి విజయకుమారి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆన్లైన్లో పాల్గొన్నారు.