దేవరుప్పుల, జూన్ 14. బాలబాలికల ఆధార్ నమోదుకు దూరప్రాంతాలకు వెళ్లకుండా పోస్టల్ శాఖ కార్యాచరణ చేపట్టింది. కార్డులేని పిల్లల తల్లిదండ్రులు పోస్ట్‌మెన్‌కు సమాచారం ఇస్తే వెంటనే స్పం దించి ఇంటికి వచ్చి ఆధార్ నమోదు చేస్తారు. మరోవైపు అంగన్వాడీ సెంటర్లలో శిబిరాలు ఏర్పాటు చేసి ఐదేళ్ల లోపు పిల్లలకు అక్కడికక్కడే నమోదు చేస్తారు. ఈ విషయంలో పోస్టల్ శాఖ, తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఒప్పందానికి వచ్చాయి. ఈ ప్రక్రియ జిల్లాలో మొదలైంది. పిల్లలు పాఠశాలలో చేరేలోపు ఆధార్ కార్డు ఉండాల్సి ఉండగా అందుకనుగుణంగా ఈ ఏర్పాట్లు చేశారు. ఇదివరకు పిల్లలను వ్యవప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆధార్ సెంటర్‌కు తీసుకువెళ్లి పడిగాపులు కాస్తేనే ఆధార్ నమోదు జరిగేది. గ్రామాల్లోనే పోస్టల్ శాఖ ఈ ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు
అన్ని గ్రామాల్లో అందుబాటులో..
పోస్టల్ శాఖ ద్వారా ఆధార్ ఇంటి వద్దే నమోదు చేసే కార్యక్రమం మొదలైంది. ఇందుకోసం ఇప్పటికే గ్రామీణ డాక్ సేవకులు, పోస్ట్మెన్లకు ఆధార్ నమోదులో శిక్షణ ఇచ్చారు. వీరు బయోమెట్రిక్‌తో ఇంటి వద్దే ఆధార్ నమోదు చేస్తారు. పిల్లవాడితోపాటు సంబంధించిన జనన ధ్రువీకరణ సర్టిఫికేట్ తెస్తే సెల్ ఫోన్లో ఉన్న ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అతని ఫోటో క్యాప్చర్ చేస్తారు. బయోమెట్రిక్‌తో వేలిముద్రలు తీసు కుంటారు. ఇక ఎక్కువ మంది పిల్లలు అంగన్వాడీ సెంటర్లో ఉంటే అక్కడే ఆధార్ నమోదు శిబిరం ఏర్పాటు చేసి పిల్లలందరి ఆధార్ నమోదు చేస్తారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.
– మూల రమాదేవి, అసిస్టెంట్ సూపరింటెండెంట్,
పోస్టల్‌శాఖ, జనగామ