జయశంకర్ భూపాలపల్లి, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : నిరుపేద కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గుడుంబా, నాటుసారాపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఈ మేరకు ఆబ్కారీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో జనవరి 2022 నుంచి మే 31 వరకు 531 కేసులు నమోదు చేసి 381 మందిని అరెస్టు చేశారు. 538 మందిని బైండోవర్ చేయడంతో పాటు 44 మందికి రూ. 14.85 లక్షలు జరిమానా విధించారు. 83 వాహనాలను సీజ్ చేశారు. 3,275 లీటర్ల గుడుంబా, 1,22,300 లీటర్ల పానకం ధ్వంసం చేసి, 4,250 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను గుడుంబా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఆబ్కారీ, పోలీస్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గుడుంబా తయారీ, అమ్మ కం, రవాణా చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించడంతో ఆయా శాఖల అధికారులు మరిం త దూకుడు పెంచారు. రెండు జిల్లాల్లో గుడుంబాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించిన ఎక్సైజ్ శాఖ మూక్ముడిగా దాడులు చేస్తున్నది.
జయశంకర్ భూపాలపల్లి ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో జనవరి 2022 నుంచి మే 31 వరకు 531 కేసులను నమోదు చేశారు. 381 మందిని అరెస్టు చేశారు. రెండు జిల్లాల పరిధిలో 3,275 లీటర్ల గుడుంబా, 1,22,300 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసి, 4,250 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 538 మందిని బైండోవర్ చేయడంతో పాటు 44 మందికి రూ. 14.85 లక్షల జరిమానా విధించారు. 83 వాహనాలను సీజ్ చేశారు.
ముమ్మరంగా దాడులు
ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలోని భూపాలపల్లి, కాటారం, ఏటూరునాగారం, ములుగు ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయం తో నిరంతరాయంగా దాడులు చేస్తూ గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నారు. తయారు చేస్తున్న, రవాణా చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ వంటి కఠినమైన కేసులను నమోదు చేస్తున్నారు. పట్టుబడిన వారిని స్థానిక తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ కాకుండా నిబంధలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధిస్తూ నోటీసులు ఇస్తున్నారు.
రవాణాను అడ్డుకుంటున్నాం..
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల నుంచి గుడుంబాతో పాటు ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలను పూర్తిగా కట్టడి చేస్తున్నాం. ఛత్తీస్గఢ్, మహహాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన నిఘా ఉంచాం. ఎవరైన రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తున్నాం.
– శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, జయశంకర్ భూపాలపల్లి