ఓరుగల్లు కోట కొత్త శోభను సంతరించుకుంది. ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తీర్చిదిద్దుతోంది. కోటను టూరిజం హబ్‌గా తయారు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషిచేస్తోంది. చరిత్రనే తిరగరాసిన కాకతీయుల చరిత్ర, పాలనా దక్షత, శిల్పకళ, సాంస్కృతిక నేపథ్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు కీర్తి తోరణాల మధ్య టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో సౌండ్ అండ్ లైట్స్ షో ఏర్పాటుచేశారు. ఈ షోను వీక్షించేందుకు కోటకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా కోటకు రంగురంగుల విద్యుత్ దీపాలతో ఫసాడ్ లైట్లను ఏర్పాటు చేసి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నారు.
మెరుస్తున్న రాతికోట
చారిత్రక నేపథ్యం కలిగిన రాతికోట, ఖుష్‌మహల్, ఏకశిలగుట్ట ఫసాడ్ లైట్లతో కాంతులీనుతోంది. రూ.6 కోట్ల నిధులతో మూడేళ్ల క్రితం మొదలుపెట్టిన ఫసాడ్ లైట్ల ట్రయల్స్‌ను కూడా నిర్వహించారు. అయితే వివిధ కారణాలతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. ఇటీవల వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వివిధ విభాగాల అధికారులతో రాతికోట వద్ద ఫసాడ్ లైట్ల పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు ముందుగా రాతికోట ఉత్తర ద్వారం, ఖుష్మహల్కు ఈ నెల 2వరకు పనులను పూర్తి చేసి లైట్లను వెలిగించారు.

ఆకట్టుకోనున్న కోట
ఫసాడ్ లైట్లతో దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్, ఇండియా గేటు మెరుస్తున్నట్లే అదే తరహాలో చారిత్రక ఖిలా ్లకూడా మెరుస్తుండడంతో స్థానికులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పండుగల ప్రాశస్త్యానికి అనుగుణంగా సౌభ్రాతృత్వం ఉట్టి పడేలా విద్యుత్ దీపాలు ఏర్పాటుచేస్తున్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవం రోజున మువ్వెన్నల జెండా కోట గోడలు, ఏకశిలగుట్ట, ఖుష్మహల్పై రెపరెపలాడుతున్నట్లు, అలాగే జాతీయ పండుగలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని లైట్ల రూపంలో ప్రదర్శిస్తారు. కోటలోని నాలుగు రాతికోట సింహద్వారాలు, ఖుష్‌మహల్, ఏకశిలగుట్ట, కీర్తితోరణాలకు దశలవారీగా ఫసాడ్ లైట్లను అమర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. ఒకవైపు సౌండ్ అండ్ లైట్స్ షో, మరోవైపు ఫసాడ్ లైట్ల కాంతులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.