Rohit Shetty House Firing | బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి నివాసంపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1, 2026 తెల్లవారుజామున ముంబై జుహులోని రోహిత్ శెట్టి నివాసంపై దుండగులు 5 రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, ఇప్పటివరకు మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిలో ఆగ్రాకు చెందిన ప్రధాన షూటర్ దీపక్ శర్మతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన మెరుపు దాడుల్లో మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రధాన అనుచరుడు శుభమ్ లోంకర్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. మరోవైపు ఈ కేసులో విచారణ జరుపుతున్న కొద్దీ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అమాయక యువతను ఈ నేర ప్రపంచంలోకి లాగడానికి నిందితులు ‘హిందుత్వ’ భావజాలాన్ని అడ్డం పెట్టుకుని వారిని బ్రెయిన్‌వాష్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
లారెన్స్ బిష్ణోయ్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యేలా చేసి, యువతను గ్యాంగ్‌లో చేర్చుకుంటున్నారని సమాచారం. అంతేకాకుండా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వంటి సోషల్ మీడియా వేదికలను వేదికగా చేసుకుని, ఆయుధాలతో ఉన్న వీడియోలను పోస్ట్ చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు వెలుగుచూసింది. ఈ కాల్పుల ఘటన కేవలం ట్రైలర్ మాత్రమేనని, భవిష్యత్తులో నేరుగా బెడ్ రూమ్ లోకి బుల్లెట్లు వస్తాయని సోషల్ మీడియా ద్వారా బాలీవుడ్ ప్రముఖులను బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవస్థీకృత నేరాన్ని అదుపు చేయడానికి పోలీసులు నిందితులపై కఠినమైన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారి శుభమ్ లోంకర్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతని కోసం గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు.