చారిత్రక ఓరుగల్లు ఎన్నో మతాలకు ఆలవాలంగా నిలిచింది. జైనుల స్థావరాలు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. వీటిలో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముస్తఫాపూర్-గొల్లపల్లి మధ్య ఉన్న దానయ్య గుట్ట ఒకటి.. జైన బసదిగా విరాజిల్లిన ఈ గుట్ట నిట్ట నిలువుగా ఉండి ఎక్కేందుకు సైతం వీలు లేకుండా ఉంటుంది. దూరం నుంచి చూస్తే గుట్టపై చిన్న గుడి కనిపిస్తుంది. స్థానికులు దీన్ని దానయ్యగుట్ట అని పిలుస్తుండగా దానిపై జైనుల ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. కాయోత్సర్గ భంగిమలో ఇక్కడ గుట్టపై చెక్కి ఉన్న జైన తీర్థంకరుని చిత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నది.
భీమదేవరపల్లి, జూన్ 11: భీమదేవరపల్లి మండలం ముస్తాఫాపూర్-గొల్లపల్లి మధ్య ఉన్న దానయ్య గుట్ట జైన బసదిగా విరాజిల్లిందనేంకు అనేక అనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. స్థానికులు పూర్వం నుంచీ ఈ కొండను దానయ్య గుట్ట అని పిలుస్తూ వస్తున్నారు. గుట్టపైకి ఎక్కేందుకు ఏమాత్రం వీలు లేని పరిస్థితిలో దానిపైకి వెళ్లి గుడిని ఎలా నిర్మించారనేది ఇప్పటికీ విస్మయపరుస్తుంది. దానయ్య గుట్ట వెనుకభాగాన మరో గుట్ట ఉంది. దానయ్య గుట్టకు చేరుకోవాలంటే ఈ గుట్ట నుంచి అతికష్టంగా సాధ్యమవుతుంది. గుట్టపైకి వెళ్లే దారి మధ్యలో అందంగా చెక్కిన రాతి స్తంభం పడి ఉంది. చుట్టుపక్కల ఎక్కడా గుడి నిర్మాణానికి గుట్టను తొలిచిన ఆనవాళ్లు లేవు..అలాంటప్పుడు ఈ రాతిస్తంభం గుట్టపైకి ఎలా వచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. దానయ్య గుట్టకు ముందుగా ఉన్న గుట్ట ప్రాంతంలో రాతిపై చెక్కిన పాద ముద్రలు ఉన్నాయి. వీటిని జైన పాదాలు అని పిలుస్తున్నారు.
గుట్టపై చెక్కు చెదరని ఆనవాళ్లు
దానయ్య గుట్టపై గుడిలో ఎలాంటి విగ్రహం లేదు. గుడి అని చెప్పేందుకు లలాటబింబం, ద్వారపాలకులు, అధిష్టానపీఠం వంటి ఆనవాళ్లు లేవు. కేవలం ఈ ప్రాంతం జైనబసదిగానే ఉన్నట్లు తెలుస్తున్నది. గుడి చుట్టూ మండపం ఏర్పాటు చేసినట్లు గుట్టను తొలిచిన రంధ్రాలు కనిపిస్తున్నాయి. దానయ్య గుట్టపై గుడి నుంచి పది అడుగుల దూరంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కోనేరు ఉన్నది. గుడి వెనుకభాగాన కాయోత్సర్గ (శరీరాన్ని వదిలి ధ్యానంలో నిమగ్నమైన) భంగిమలో జైనతీర్థంకరుడి చిత్రం చెక్కి ఉన్నది. ఈ ప్రాంత ప్రజలకు దీని విశిష్టత తెలియకపోవడంతో దీనిని దింపుడు కల్లెం చిహ్నమని భావిస్తున్నారు. అనునిత్యం ధ్యానంలో ఉండే జైనులు అప్పుడప్పుడూ గుట్ట కిందకు వెళ్లి ప్రజల నుంచి పండ్లు, ఫలాలు తెచ్చుకుంటూ ఈ ప్రాంతంలో కఠోర ధ్యానం చేసినట్లు తెలుస్తున్నది. గుట్టపైకి వెళ్లగానే చుట్టూ పంట పొలాలు, పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత, ఆహ్లాదకర వాతావరణం మైమరిపింపజేస్తాయి.

ఇది జైన స్థావరమే
ఈ గుట్టపై జైన పాదాలు ఉన్నాయి. ఇది తప్పక జైన స్థావరమే అయి ఉంటుంది. కాయోత్సర్గ భంగిమలో జైన తీర్థంకరుడి చిత్రం గుట్టపై చెక్కి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలమడుగు సమీపంలో దానవులపాడు ఉంది. ఈ దానయ్య గుట్టకు దానవులపాడు జైనక్షేత్రానికి పోలికలున్నాయేమో చూడాలి..
-శ్రీరామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్
దానయ్యగుట్ట అని పిలుస్తం
వెనుకటి నుంచి ఈ గుట్టను దాన య్య గుట్ట అనే పిలుస్తున్నం. గుట్టపై ఎలుగుబం ట్లు ఎక్కువ ఉన్నాయని ఎక్కేందుకు ఎవరూ సాహసించరు. గుట్టపైన గుడి ఉంది అని మాత్రం తెలుసు. ఇది జైన బసది అని అంటుంటే మా ఊరికి ఇంత చారిత్రక విశేషముందా అని గర్వంగా అనిపిస్తున్నది. గుట్ట ఎక్కేందుకు అస్సలు వీలు కాదు. అయినా ఆ కాలంలో గుడి ఎలా నిర్మించారో.. అద్భుతమే..
– కోండ్ర రజనాచారి, ఉపసర్పంచ్, ముస్తాఫాపూర్