దుగ్గొండి, జూన్ 11: పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం వాడవాడలా అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. దుగ్గొండి మండలంలోని శివాజీనగర్‌లో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ అధికారులు, గ్రామస్తులతో కలిసి కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ద్వారా సమస్యలు తెలుసుకున్నారు. పల్లెల అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచినందుకు సర్పంచ్, కార్యదర్శిని అభినందించారు. అనంతరం గ్రామస్తులతో జరిగిన సమావేశంలో హరిసింగ్ మాట్లాడుతూ పల్లెప్రగతి పనులను వందశాతం పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. డంపింగ్ యార్డులోని చెత్త ద్వారా వర్మీకాంపోస్టు తయారు చేసి రైతులతోపాటు ఇతరులకు విక్రయించాలని సూచించారు. తద్వారా జీపీలకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. హరితహారం కోసం నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, సర్పంచ్ లింగంపల్లి ఉమారవీందర్రావు, కార్యదర్శి వినోద్‌కుమార్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రతపై దృష్టి సారించాలి
నర్సంపేటరూరల్: పరిసరాల శుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని నర్సంపేట మండలం రాములునాయక్‌తండా ప్రత్యేకాధికారి రజాక్, సర్పంచ్ అజ్మీరా మాధవి అన్నారు. ఐదో విడుత పల్లెప్రగతిలో భాగంగా శనివారం రాములునాయక్తండాలో జరుగుతున్న పనులను రజాక్ పరిశీలించారు. ఇటుకాలపల్లిలో సర్పంచ్ మండల రవీందర్, ముగ్ధుంపురంలో సర్పంచ్ పెండ్యాల జ్యోతి, రామవరంలో సర్పంచ్ కొడారి రవన్న ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది డ్రైనేజీలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. నాగుర్లపల్లిలో సర్పంచ్ కందికొండ రజిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వార్డు సభ్యులు, కార్యదర్శి పాల్గొన్నారు.
నిర్లక్షం చేస్తే చర్యలు..
చెన్నారావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనుల్లో నిర్లక్షం చేస్తే చర్యలు తప్పవని ఎంపీవో కూచన ప్రకాశ్ హెచ్చరించారు. మండలంలోని జోజిపేట, నారాయణతండాలో ఆయన అభివృద్ధి పనులను పరిశీలించారు. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీల పెంపకం, పల్లెప్రకృతి వనాలను సందర్శించారు. గ్రామాల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. చెన్నారావుపేటలోని రోడ్లు, కాల్వలను అధికారులు శుభ్రం చేయించారు. ప్రత్యేక అధికారి బాలకిషన్, స్థానిక నాయకులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాలకిషన్ గ్రామంలోని శ్మశాన వాటిక, డంపింగ్ యార్డును పరిశీలించి నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న, ఆర్బీఎస్ కన్వీనర్ బుర్రి తిరుపతి, సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, మాజీ ఎంపీపీ జక్క అశోక్, కార్యదర్శి సురేశ్, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
తిమ్మాపురంలో బోరు పనులు ప్రారంభం
సంగెం: తిమ్మాపురంలో ఎంపీపీ కళావతి బోరు పనులను ప్రారంభించారు. మండల పరిషత్ నిధులతో బోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ తెలిపారు. ఇందులో భాగంగా తిమ్మాపురం, గాంధీనగర్, నర్సానగర్లో పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల్లో బోర్లు వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ గన్ను శారద-సంపత్, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఆర్డబ్ల్యూఎస్ డీఈ వేణు, ఉపసర్పంచ్ సారంగం, వార్డు సభ్యులు రాములు, రాజు, పోశాల రాజేశ్, సుమన్, ధనుంజయ, సంపత్, తాటికొండ రాములు, కార్యదర్శి స్రవంతి, మునుకుంట్ల మోహన్ పాల్గొన్నారు.