కరీమాబాద్, జూన్ 11: వరంగల్ మహా నగర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మహానగరపాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గ్రేటర్ 41వ డివిజన్లో కార్పొరేటర్ పోశాల పద్మ ఆధ్వర్యంలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రగతిలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యకు పోశాల పద్మ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ డివిజన్లలోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. సమష్టిగా పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోశాల స్వామి, ఈదుల రమేశ్, కలకోట్ల రమేశ్, ఈదుల భిక్షపతి, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
42వ డివిజన్లో పర్యటన
గ్రేటర్ 42వ డివిజన్ రంగశాయిపేటలో కార్పొరేటర్ గుండు చందన ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య డివిజన్లో పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. తెలంగాణకాలనీలోని మురుగునీరుపారేలా చర్యలు చేపట్టాలని గుండు చందన కోరగా వారు పరిష్కారిస్తామన్నారు. కార్యక్రమంలో గుండు పూర్ణచందర్, కొల్లూరి యోగానంద్, దామెరకొండ కరుణాకర్, వరంగల్ మహానగరపాలక సంస్థ సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.