వరంగల్ చౌరస్తా, జూన్ 11 : కాకతీయ మెడికల్ కళాశాల సైకియాట్రిక్ విభాగం, వరంగల్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్‌రాజ్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 8వ వార్షికోత్సవం శనివారం ప్రారంభమైంది. కేఎంసీలోని ఎన్ఆర్ఐ భవన్లో వేడుకలను ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రఘురామిరెడ్డి మాట్లాడుతూ ఒత్తిడిని జయించలేక అనేక మంది ఆత్మహత్య, నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్, తగిన విధంగా వైద్యసేవలు అందిస్తే వారి మానసికస్థితిలో మార్పులు తీసుకురావొచ్చని అన్నారు.
మానసిక వైద్యరంగంలో చాలా మార్పులు వచ్చాయని, వాటిని వినియోగించి మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ఎన్ రాజు మాట్లాడుతూ వరంగల్‌లో 120 పడకలతో మానసిక వైద్య కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని, అందులో భాగంగా మంత్రి హరీశ్‌రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డిని కలిసి వైద్యశాల ఆవశ్యకతను గురించి వివరిస్తామని అన్నారు. ఏషియా ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ మానసిక వైద్యంలో భారతదేశం ఖ్యాతి సాధించడానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వైద్యశాస్త్ర నవీనపోకడలకు అనుగుణంగా నేటితరం సామాన్య మానవుడి మానసిక స్థితిని మెరుగుపరచాలని కోరారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ కార్యదర్శి అరవింద బ్రహ్మ, మైసూరు నుంచి డాక్టర్ టీఎస్ఎస్ రావు, డాక్టర్ సుజిత్ సర్కెల్, భువనేశ్వర్ నుంచి డాక్టర్ తుపాన్ పటి, డాక్టర్ ఉదయ్‌కుమార్, డాక్టర్ పీ కిషన్, 300 మంది మానసిక వైద్యనిపుణులు పాల్గొన్నారు.