సంప్రదాయ పంటలతో నష్టం వాటిల్లుతుండడంతో రైతులు ప్రత్యామ్నాయం వైపు సాగుతున్నారు. ఈసారి వరి సాగు తగ్గించి పత్తి వేసేందుకే మెజార్టీ రైతులు మొగ్గుచూపుతున్నారు. గతేడాది వానకాలం సీజన్లో 1,90,126 ఎకరాల్లో వరి వేయగా, ప్రస్తుతం సాగు అంచనా 1,67,639 ఎకరాలకు తగ్గింది. అదే సమయంలో గతేడాది 1,44,617 పత్తి సాగుచేయగా ఈసారి 1,67,666 ఎకరాల సాగు అంచనా పెరుగడం విశేషం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం, క్వింటాల్‌కు రూ.12వేలకు పైగా ధర పలుకుతుండడంతో రైతులు పత్తి వేయనుండగా కంది సాగుపైనా దృష్టిపెడుతున్నారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం అంచనా 3,70,008 ఎకరాలు కాగా వీటిలో ప్రధాన పంటలు మినహా 23,699 ఎకరాల్లో కంది, 4973 ఎకరాల్లో మక్కజొన్న, 799 ఎకరాల్లో వేరుశనగ, 317 ఎకరాల్లో పొగాకు సాగుకానున్నాయి.
జనగామ, జూన్ 6, (నమస్తే తెలంగాణ) : వడ్ల కొనుగోలుపై కేంద్రం మడత పేచీలతో వరి పంట సాగుపై నిరాసక్తత కనబరుస్తున్న జిల్లా రైతాంగం ఈ వానకాలం ప్రత్యామ్నాయంగా పత్తి, కంది పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర సర్కార్ ఈ యాసంగి ధాన్యం కొనుగోళ్లను నిరాకరించినా రైతులకు ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చివరి గింజ దాకా సేకరణకు సిద్ధమైంది. జిల్లాలో ఈసారి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు జరిగినా.. వరి పంట సాగుకు బదులు ఇతర పంటలను వేయాలన్న ఆలోచనలో రైతాంగం ఉంది.
వరికి ప్రత్యామ్నాయంగా పత్తి వైపు రైతులు మొగ్గు చూపడానికి ఈ ఏడాది పత్తి క్వింటాల్ ధర రూ.12వేలకు పైగా పలకడంతో పాటు కంది పంటలకు మంచి డిమాండ్ ఉండడం..ప్రభుత్వం కూడా పత్తి, కంది సాగు పెంచాలని నిర్ణయించడంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. వరి విస్తీర్ణాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ సాగు నీటి లభ్యత పెరగడంతో జనగామ వంటి ప్రాంతంలో అనివార్యంగా సాగవుతున్నది. గత వానాకాలంలో ఇదే సీజన్లో జిల్లాలో అన్ని పంటలు కలిపి 3,73,301 ఎకరాల్లో సాగు అంచనా ఉంటే 3,61,934 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, గత ఏడాది కంటే ఈ సంవత్సరం 3,293 ఎకరాల అంచనా విస్తీర్ణం తగ్గింది. గత వానకాలంలో వరి అంచనా విస్తీర్ణం 1,13,300 అయితే రైతులు 1,90,126 ఎకరాల్లో నాట్లు వేశారు. 2లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని అంచనా వేసినా 1,44,617 ఎకరాల్లో మాత్రమే వేశారు.
అంటే జిల్లాలో గత ఏడాది వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలకు మించి 76,826 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి వానకాలంలో సీజన్లో అన్ని రకాల పంటలు కలిపి 3,70,008 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేయగా, అందులో వరి, పత్తి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ లెక్కలు వేస్తున్నది. 1,67,639 ఎకరాల్లో వరి, 1,67,666 ఎకరాల్లో పత్తి, 23,699 ఎకరాల్లో కంది, 4973 ఎకరాల్లో మక్కజొన్న, 799 ఎకరాల్లో వేరుశనగ, 317 ఎకరాల్లో పొగాకు పంట సాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రకాల పంటల కోసం 1,11,077 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పత్తి, వరి, కంది విత్తనాలు జిల్లాలోని అథీకృత డీలర్లకు చేరగా ఒకటి, రెండు రోజుల్లో జిల్లాకు ఎరువులు కూడా రానున్నాయి.