ములుగు రూరల్, జూన్ 3: ప్రభుత్వ పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో బడి బాట కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినందున తల్లిదండ్రులందరూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.
ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య, హాజరుశాతాన్ని పెంచేందుకు గ్రామాల్లోకి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం డీసీఈబీ కార్యదర్శి విజయమ్మ మాట్లాడుతూ మొదటిరోజు ముగ్గురు విద్యార్థులు ములుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలను కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి జయదేవ్, ఎంఈఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం, రాజేందర్, మల్లయ్య, నజీరోద్దీన్, సతీష్, చంద్రమౌళి, మమత, మధు, భాస్కర్‌రెడ్డి ఉన్నారు. కాగా, బడిబాట మొదటి రోజు కార్యక్రమాన్ని మండలంలోని బండారుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ బడిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో బడిబాట కార్యక్రమం ఉదయం ముమ్మరంగా కొనసాగింది.