దేవరుప్పుల, జూన్ 3 : పల్లెల సమగ్రాభివృద్ధే పల్లె ప్రగతి లక్ష్యమని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని అమలుచేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని కడవెండిలో శుక్రవారం పల్లె ప్రగతి, మన ఊరు మన బడి, బడిబాట, తెలంగాణ క్రీడా మైదానం, రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలలో సర్పంచ్ పోతిరెడ్డి బెత్లినారెడ్డి అధ్యక్షతన జరిగిన పల్లెప్రగతి సభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, క్రీడల ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పీఆర్ కమిషనర్ శరత్, జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్యతో కలిసి పాల్గొన్నారు. ఇక్కడ ఎర్రబెల్లి మాట్లాడుతూ నాలుగు విడుతల్లో జరిగిన పల్లె ప్రగతి పనులతో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, ఆరోగ్యం పెరిగిందన్నారు. ఫలితంగా సీజనల్ వ్యాధులు రావడం లేదన్నారు. పల్లె ప్రగతి వల్లే గ్రామాల్లో వన నర్సరీలు ఏర్పడ్డాయని, కడవెండి వన నర్సరీని అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
గ్రామంలో శ్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ, తడిపొడి చెత్త సేకరణ, వీధుల శుభ్రతతో లక్ష్యం నెరవేరదని, దీర్ఘకాలిక ప్రయోజనాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రానున్న పల్లె ప్రగతిలో కార్యాచరణ ఉంటుందన్నారు. గ్రామం సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా బలంగా ఉంటేనే సార్థకత చేకూరుతుందన్నారు. ఇందుకు గాను స్థానికంగా విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని అందులో భాగంగానే ‘మన ఊరు-మన బడి’ రూపకల్పన జరిగిందన్నారు. అలాగే గ్రామాల్లో వైద్యశాలల ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ తెచ్చిన వ్యక్తే మనకు ముఖ్యమంత్రి కావడంతో పాటు రాష్ట్రంలో విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక్కోరంగాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారని వివరించారు.
కొత్త రాష్ట్రమైనా అనతికాలంలోనే వేగంగా అభివృద్ధి చెందిందని ఎర్రబెల్లి అన్నారు. ఇప్పటికే వ్యవసాయంలో విజయం సాధించామని, గ్రామాల్లో రైతుల వలసలు ఆగిపోయి జోరుగా వ్యవసాయ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా సాగునీటితో పాటు పెట్టుబడి సాయం, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నదన్నారు. ఒక్కసారి తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక గ్రామాల పరిస్థితిని బేరీజు వేసుకోవాలని కోరారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధిస్తుండడంతో ప్రతిపక్షాలకు మొసమర్రడం లేదని, పనికి రాని మాటలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలితరాష్ర్టాల్లో ఈ పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించిన ఎర్రబెల్లి.. దేశాన్ని బీజేపీ తిరోగమనం వైపు నడుపుతున్నదన్నారు.
మహిళా ఉత్పత్తుల స్టాల్ ప్రారంభం
పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, బచ్చన్నపేట, రఘునాథపల్లి మండలాల మహిళలు పల్లె ప్రగతి ప్రాంగణంలో తాము చేసిన ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేయగా మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. హ్యాండీక్రాఫ్ట్, హ్యాం డ్లూం, ఎంబ్రాయిడరీ, పచ్చళ్లు, మిల్లెట్‌తో చేసిన తినుబండారాలు, ఫుడ్స్, అగ్రి ప్రాసెసింగ్ ఉత్పత్తులను ప్రదర్శించగా మంత్రితో పాటు సుల్తానియా, శరత్, కలెక్టర్‌తో తిలకించి వారిని మెచ్చుకున్నారు. మహిళా సంఘాల కృషిని వారు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీపీవో రంగాచారి, ఎంపీపీ బస్వ సావిత్రి, జడ్పీటీసీ పల్లా భార్గవిరెడ్డి, ఎంపీటీసీ దుబ్బాక కవిత, ఎంపీడీవో రాజలింగం, పంచాయతీ కార్యదర్శి మధుకర్ ఉన్నారు.