పాలకుర్తి రూరల్, జూన్ 3: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదో విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీనారాయణపురం, తొర్రూరు(జే), పాలకుర్తి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు పల్లెప్రగతి కార్యక్రమం ఉంటుందన్నారు. పల్లెల్లో పారిశుధ్యం, పచ్చదనమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టిందన్నారు. దీంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, పరిశుభ్రంగా మారుతాయన్నారు. ఇప్పటికే వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, సెగ్రికేషన్ షెడ్డు పూర్తి చేశామన్నారు.
తడి, పొడి చెత్తపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అధికారులను కోరారు. సీసీ రోడ్లతో గ్రామాలకు మహర్ధశ లభించిందన్నారు. పల్లె ప్రగతిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎకరం స్థలంలో క్రీడా ప్రాంగణాలు ఉండాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయన్నారు. పల్లె ప్రగతిలో సర్పంచ్‌లు, కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్లె ప్రగతి విజయవంతానికి ప్రతి గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమించామని కలెక్టర్ పేర్కొన్నారు. దీనిపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆనంతరం పాలకుర్తిలో సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి కలెక్టర్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మల్యాల సరిత పరశురాములు, నాయిని మల్లారెడ్డి, వీరమనేని యాకాంతారావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్‌ర్డీవో కృష్ణవేణి, ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్, తహసీల్దార్ భూక్యా పాల్ సింగ్, డీటీ బాశెట్టి హరిప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు గంట శిరీష, బాశంపల్లి మహేశ్, వెంకటాచారి, గుండెవేని కుమార్, ఉప సర్పంచ్‌లు బొడిగె ప్రదీప్, తరాల చంద్రబాబు పాల్గొన్నారు.