తొర్రూరు, జూన్ 3 : క్షయ వ్యాధితో కదల్లేని స్థితిలో దవాఖానలో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఈ-పట్టా అందించి రెవెన్యూ అధికారులు మానవత్వం చాటుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన లోకుంట్ల పూజ తల్లిదండ్రులు క్షయవ్యాధితో కొన్ని నెలల క్రితం మృతిచెందారు. ఈ క్రమంలో పూజకు క్షయ వ్యాధి రావడంతో కొద్దిరోజులు ఇంటి వద్దే ఉంటూ చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో సమీప బంధువుల సహాయంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరింది. అయితే చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేకపోవడంతో చివరికి ఎర్రగడ్డ క్షయ ఆసుపత్రిలో చేరింది. పూజకు మడిపల్లిలో వారసత్వంగా సంక్రమించిన ఎకరం 20గుంటల భూమి ఉంది. సదరు భూమి పట్టా చేయించుకునేందుకు తెలిపిన వారి సహకారంతో ధరణి వెబ్సైట్లో ఇటీవల స్లాట్ బుక్ చేసుకుంది. వ్యాధి తీవ్రత కారణంగా తహసీల్దార్ కార్యాలయంలో బయోమెట్రిక్ చేయించుకోలేక పోయింది. పూజ పరిస్థితిని కలెక్టర్, తొర్రూరు ఆర్డీవోలకు తహసీల్దార్ రాఘవరెడ్డి వివరించగా మానవతా దృక్పథంతో స్పందించారు. చికిత్స పొందుతున్న దవాఖానకే వెళ్లి బయోమెట్రిక్ తీసుకోవాలని సూచించడంతో శుక్రవారం హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లారు. తొర్రూరు రెవెన్యూ సిబ్బంది, ధరణి ఆపరేటర్ బయోమెట్రిక్ తీసుకొని సక్షేషన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ-పట్టా జారీ చేశారు.