ఎర్రటెండల్లో చెరువులు మత్తడి దుంకంగ ఎన్నడన్న జూసినమా..?
ఊరూరా నీళ్లకు తండ్లాట.. కరంటుకు కటకట..
ఎరువుల కోసం కొట్లాట.. ఇదే కదా గతమంత!
సర్కారు దవాఖాన్ల గిసొంటి వైద్యం ఊహించినమా?
ఏండ్లకేండ్లు పాడుకున్నది ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే కదా..!
ప్రగతి పరవళ్లు పక్కనపెడితే.. పల్లెల్లో కనీస సౌలత్లు ఉండెనా?
నిధుల్లేక నీరసించిన స్థానిక సంస్థలు.. కరంటు బుగ్గలకు కూడా కండ్లుకాయలు కాసేలా ఎదురుచూసిన రోజులు.. ఇవే కదా గత జ్ఞాపకాలు..! ఇప్పుడా చీకట్లు ఉన్నయా?
మన పొలాలకు నీళ్లు మళ్లి.. మనోళ్లకు ఉద్యోగాల కల సాకారమయ్యే తరుణం వచ్చి.. ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతూ.. ప్రతి ఊరిలో అభివృద్ధి పరిఢవిల్లుతూ..
పరిపాలన చేరువై మారుమూల ప్రాంతాల్లోనూ ప్రగతి వెలుగులు విరజిమ్ముతున్నాయి.. దశాబ్దాల ‘సమైక్య’ సంకెల తెంచుకొని దేశ అవనికపై కొంగొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, నేటితో ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని, తొమ్మిదో ఏట అడుగిడుతున్నది. తన ‘దీక్షా’దక్షతలతో స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్, పాలనా పగ్గాలు చేపట్టిన ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో అద్భుతాలు సృష్టించింది.
జయశంకర్ భూపాలపల్లి/ములుగు, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రం సిద్ధించి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడేళ్లలోనే అందరి ఆకాంక్షలూ ఫలించాయి. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ దిక్చూచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సారథ్యంలో బంగారు తెలంగాణవైపు బాటలు పడ్డాయి. ఉద్యమ ఆకాంక్షలైన ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నెరవేరి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అనుభవంలోకి వచ్చాయి. మన నీళ్లు మన పొలానికి పారుతున్నాయి. మన నిధులు సంక్షేమ పథకాల రూపంలో మన ఇంటికే అందుతున్నాయి. మన ఉద్యోగాలు మన వాళ్లకే దక్కుతున్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా కొత్త రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, వ్యవసాయం.. ఇలా అన్నింటిలోనూ దేశానికే దిక్చూచిగా నిలిచింది.

మన దేశ జీవన విధానంగా ఉన్న వ్యవసాయంతోనే మన ఆర్థికానికి భరోసా. సమగ్ర వికాసం లక్ష్యంగా పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అలుపెరుగని కృషి చేసింది. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్ భగీరథతో అన్ని చెరువులనూ బాగు చేసింది. దేశంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేసింది. ఎస్సారెస్పీ పునరుజ్జీవంతో ఆయకట్టుకు జీవం పోసింది. దేవాదుల, ఎస్సారెస్పీ పరిధిలో ఉండే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఊపిరిలూదింది. ఉమ్మడి జిల్లాకు అతి కీలకమైన తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసింది. అన్నదాతల పెన్నిధిగా ఉన్న సీఎం కేసీఆర్ సాగునీటితోపాటు వ్యవసాయానికి ఉచిత కరంటు అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కరంటు ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. భూపాలపల్లిలో సీఎం కేసీఆర్ కొత్త కరంటు ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. అన్నింటి కంటే ముఖ్యంగా రైతులకు పెట్టబడి కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.900 కోట్లను రైతు బంధు పేరిట అందిస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ భరోసా కల్పిస్తున్నారు.

ఉద్యమనేతగా ఉన్నప్పుడు కేసీఆర్ తెలంగాణలో ప్రజలు, రైతులు పడుతున్న సాగు నీటి, విద్యుత్ సమస్యలను చూసి చలించారు. 2002లో భూపాలపల్లి కేంద్రంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలోనే భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలను, రాజకీయ నాయకులను ఏకం చేశారు. ఉద్యమ సారధి కేసీఆర్ పోరాట ఫలితంగా 2006 జూన్‌లో కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభమయ్యాయి. మొదటి దశలో 2010 మే10న విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం రెండో దశ పనులు ప్రారంభించి 2016లో పూర్తి చేశారు. 2016 జనవరి 5న 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. సాగు, తాగు నీటి గోస తీర్చేందుకు 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి చేశారు. 2019 జూన్ 21న అత్యంత వైభవంగా పూజలు చేసి పండుగ వాతావరణంలో ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అది 2001 జూన్ 21. కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్.. సాయంత్రం ఏడు గంటలకు మీటింగ్. ఎటు చూసినా యువకులే.. అప్పుడు వచ్చిండు ఓ బక్క పలుచని మనిషి. అప్పటి వరకు ఆయన పేరు వినడమేగానీ నేరుగా చూసిన వారు తక్కువే. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పట్టుదలతో బయలుదేరిండు. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కేడీసీ గ్రౌండ్లో ఆ రోజు సాయంత్రం భారీగా తరలి వచ్చిన జనం ఆయన ప్రసంగం కోసం ఎదురు చూసిన్రు. జై తెలంగాణ నినాదంతో ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్ అదే నినాదంతో ముగించారు. మధ్యలో దాదాపు గంటపాటు ఆయన మాట్లాడిన మాటలు ప్రజల్లో కొత్త ఆశలు కలిగించాయి. సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కండ్లకు కట్టేలా వివరించిండు. మన నిధులు, నీళ్లు, నియామకాలను సీమాంధ్ర ప్రాంతం వారు దోపిడీ చేస్తున్న తీరును అందరికీ తెలిసేలా చెప్పిండు. మన సంస్కృతి, సంప్రదాయాలను చిన్నచూపు చూస్తున్న తీరును తెలంగాణ నానుడులతో తేట తెల్లం చేసిండు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప వివక్ష పోదని వివరంగా చెప్పిండు. కేడీసీ గ్రౌండ్‌కు వచ్చిన ప్రతి యువకుడు అదే మాటతో ఊళ్లకు చేరిండు. తెలంగాణ వచ్చి తీరాలని గట్టిగా అందరికీ చెప్పిన్రు. కేసీఆర్ ఒక్కనితోనే అది సాధ్యమని నమ్మిన్రు. అదే నిజయమైంది. 14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో తెలంగాణ కల సాకారమైంది.
ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలనే విధానంతో పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆసరా పథకంతో తొమ్మిది కేటగిరీల వారికి సామాజిక భద్రత కల్పిస్తున్నది. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, రైతు బంధు, రైతు బీమా అమలు చేస్తున్నది. చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ వంటి పథకాలతో చేతి వృత్తులకు, కుల వృత్తులకు భరోసా కల్పిస్తున్నది. భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి పోర్టల్ రెవెన్యూ చరిత్రలోనే కొత్త అధ్యాయంగా నిలిచాయి.
తెలంగాణలో వరంగల్‌ను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. రాష్ట్రంలో ఏకైక హెల్త్ యూనివర్సిటీ ఇక్కడే ఉన్నది. తెలంగాణ కోసం పోరాడిన కాళోజీ నారాయణరావు పేరిట ఇది ఏర్పాటైంది. మొదటినుంచీ వరంగల్ ఆరోగ్య సేవల విషయంలో కీలకంగా ఉంటున్నది. ఎంజీఎం, కేఎంసీలతో ప్రభుత్వపరంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు వైద్య సేవలందుతున్నాయి. దీనికి కొనసాగింపుగా సీఎం కేసీఆర్ కేసీఎం కాలేజీ ఆవరణలో ఇప్పటికే రూ.150 కోట్లతో 250 పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించారు. తాజాగా ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ(ఎంసీహెచ్)కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సెంట్రల్ జైలును తరలించి అక్కడ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలని నిర్ణయించి రూ.1100కోట్లతో పనులు ప్రారంభించారు. జిల్లాలకు మెడికల్ కాలేజీలను మంజూరు చేశారు.
ములుగు, జూన్ 1(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా కేసీఆర్ 2001 ములుగు ప్రాంతంలో తొలిసారి పర్యటించారు. వేసవిలో అగ్ని ప్రమాదం కారణంగా ములుగు మండలం భాగ్యతండాతో పాటు వెంకటాపూర్ మండలం బూర్గుపేటలో పేదల ఇండ్లు కాలిపోయాయని తెలుసుకొని ఈ రెండు చోట్లకు వెళ్లి సొంత ఖర్చుతో బాధితులను ఆదుకున్నారు. భాగ్యతండాలో కీమానాయక్ కుమార్తె కల్పన వివాహాన్ని సొంత ఖర్చులతో జరిపించారు. ఆనాటి తండ్రి బాధను మర్చిపోని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఇలా ఏ ఆడబిడ్డ పెళ్లికి ఇబ్బందికావద్దని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీటీసీ అభ్యర్థిగా ఆనాడు బేతెల్లి గోపాల్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి ములుగులో బరిలో నిలువగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పాల్గొన్నారు. భారీ వర్షం కారణంగా సరైన సభా వేదిక లేకపోవడంతో ములుగు కృష్ణకాలనీకి చెందిన రాజయ్య అనే వ్యక్తి నిర్మిస్తున్న ఇంటి మొదటి అంతస్తుపై నుంచే ప్రసంగించారు. నాడు వెనుకబడిన ములుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టే 2018లో ములుగులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ములుగు ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా ఏర్పాటు ప్రకటన చేశారు. 2019లో తొమ్మిది మండలాలతో కూడిన జిల్లాను ఏర్పాటుచేసి అన్ని జిల్లాలతో సమానంగా విధులు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు.

ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌కు ములుగు ప్రాంతంపై పూర్తి అవగాహన ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర నిర్బంధం ఉన్నా జడ్పీటీసీ ఎన్నికల ప్రచార సభలో అప్పటి పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఎక్కువమంది తరలివచ్చి కేసీఆర్ ప్రసంగం విన్నారు. ఈ సభతో టీఆర్ఎస్ అభ్యర్థి గోపాల్‌రెడ్డి రైతు నాగలి గుర్తుతో టీడీపీ అభ్యర్థిపై ఘన విజయం సాధించాడు. అనంతరం పలుమార్లు ములుగు ప్రాంతంలో పర్యటించి ప్రతీ నాయకుడిని పేరు పెట్టి పిలిచే అంత జ్ఞాపక శక్తి కేసీఆర్‌కు ఉంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ములుగు ప్రాంత అభివృద్ది కోసం 2016లో అజ్మీరా చందూలాల్‌కు మంత్రి పదవిని కేటాయించి ములుగు ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించారు. 2018లో జిల్లా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాటను మరువకుండా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ములుగు ఎంతో అభివృద్ధి చెందింది.
– బైకాని ఓదేలు, ఆత్మచైర్మన్, ములుగు

ఖిలావరంగల్, జూన్ 1 : ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఓరుగల్లుకు వచ్చిన ఉద్యమసారథి కేసీఆర్ ఖిల్లా వేదికగా కార్యకర్తలు, ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపారు. అంతేగాక వరంగల్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసి.. కాకతీయుల కీర్తిని మరింత పెంచుతానని హామీ ఇచ్చి.. తెలంగాణ సాకారమైన తర్వాత అక్షారాలా నిజం చేశారు. ప్రచారయాత్రలో భాగంగా 2002లో ఉద్యమ నేత కేసీఆర్, ఆచార్య జయశంకర్ సార్, కెప్టెన్ లక్ష్మీకాంతారావుతో కలిసి ఖిల్లాకు తొలిసారి వచ్చారు. స్థానికంగా ఉన్న నాయకులు మిట్టపెల్లి కట్టమల్లు, బైరబోయిన దామోదర్‌యాదవ్, బొలిశెట్టి అశోక్, సంగరబోయిన చందర్, కొల్లూరి యోగానంద్, దిండిగాల సోమేశ్వర్, యెలుగం సత్యనారాయణ, మరుపల్ల రవితో పాటు మరికొందరితో కలిసి స్వయంభు శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆ తర్వాత చారిత్రక ప్రాశస్త్యం కలిగిన కీర్తితోరణాల ప్రాంగణంలో కలియదిరిగారు. కీర్తితోరణాల సమీపంలో అలాగే ఖిల్లా కోటపై, పద్మశాలివాడ, యాదవవాడ, దళితవాడలో మొదటిసారి గులాబీ జెండాను ఆవిష్కరించారు. పడమర కోట చమన్‌లో సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ వస్తేనే వరంగల్(ఉమ్మడి) జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సీమాంధ్ర పాలనలో మూతపడ్డ అజాంజాహి మిల్లుపై మాట్లాడారు. వెలవెలబోతున్న కాకతీయుల కీర్తిని మరింత పెంచి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టే అజాంజాహి మిల్లుకు ప్రత్యామ్నాయంగా టెక్స్టైల్ పార్క్ నిర్మించారు. అలాగే కాకతీయుల కీర్తి తోరణాన్ని రాష్ట్ర రాజముద్రలో పెట్టి కాకతీయుల కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న కోటలో నాడు సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలను విశ్వసిస్తూ సబ్బండ వర్గాల ప్రజలు, వామపక్ష పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గుచూపారు.
ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలను పునర్విభజన చేసింది. ఉమ్మడి వరంగల్‌తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని మండలాల చేరికతో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఎన్నో పెద్ద గ్రామాలు మండలాలయ్యాయి. గిరిజన తండాలు ప్రత్యేక పంచాయతీలుగా మారాయి. పరిపాలన ప్రజల చెంతకు చేరింది. మారుమూల ప్రాంతాల్లోనూ ప్రగతి పరవళ్లు తొక్కేందుకు బాటలు పడ్డాయి. పరిపాలన కేంద్రాలు ఉత్తమంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒక్క చోట ఉండేలా ఆత్యాధునిక భవనాలను నిర్మిస్తున్నది. హనుమకొండ, జనగామ జిల్లాల సమీకృత కార్యాలయ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. భూపాలపల్లి, మహబూబాబాద్‌లో పనులు పురోగతిలో ఉన్నాయి. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలోనూ పునర్విభజన చేసింది. కొత్తగా పోలీసు స్టేషన్లను, సర్కిళ్లను, డివిజన్ పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. స్వరాష్ట్రంలోనే వరంగల్ పోలీసు కమిషనరేట్ ఏర్పాటైంది.

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను ఎనిమిదేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దింది. నగరపాలక సంస్థగా ఉన్న వరంగల్‌ను 2015 జనవరిలో సీఎం కేసీఆర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)గా మార్చారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ నిరంతర పర్యవేక్షణతో ఎనిమిదేళ్లలో రూ.6వేల కోట్లతో గ్రేటర్ వరంగల్‌లో అభివృద్ధి కొంత పుంతలు తొక్కింది. రూ.179 కోట్లతో డ్రైనేజీ ఆధునీకరణ పనులు పూర్తవుతున్నాయి. రూ.1589 కోట్లతో ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీటి వ్యవస్థను ఏర్పాటైంది. జీడబ్లూఎంసీ ఆధ్వర్యంలోనే రూ.1560 కోట్లతో 9,111 పనులు చేపట్టారు. నగరంలోని 183 స్లమ్స్, 42 విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. రూ.300 కోట్లతో విలీన గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి పైపులైను, వీధి దీపాలు వంటి మౌళిక వసతులు కల్పించారు. స్మార్ట్ సిటీ కింద రూ.100 కోట్లతో భద్రకాళీ బండ్ నిర్మాణం మొదటి దశ పూర్తయ్యింది. రెండో దశ పనులు జరుగుతున్నాయి.

నెల్లికుదురు, జూన్ 1 : తండాలు, గూడేలు, పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలనే కేసీఆర్ ఆలోచన జామతండా నుంచే మొదలైంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో తిరిగి ప్రజల సమస్యలేమిటో తెలుసుకొని, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను గుర్తించిన ఉద్యమనేతకు వాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే తలంపు తీసుకొచ్చింది ఈ ఊరే. రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఉద్యమ నేత కేసీఆర్.. 2008లో ఏప్రిల్ 6న రాత్రి తొర్రూరులో బహిరంగ సభలో పాల్గొని నెల్లికుదురు మండలం జామతండాలో బసచేశారు. పల్లెలు, తండాల్లో, గూడేల్లో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలు తెలుసుకొనేందుకు క్షేత్రస్థాయిలో భాగంగా ఈ తండాలో నిద్రచేశారు. వేకువజామునే నిద్రలేచి పండ్ల పుల్ల వేసుకొని తండాలో ఇంటింటికీ వెళ్లి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఎట్లున్నరు.. బాగున్నరా..? అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుసాగారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని, మీ కష్టాలన్నీతీరుస్తానని మాటిచ్చారు. ఆ తర్వాత తండాలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉగాది వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం ఉగాది పచ్చడి తాగి తిరిగి తండా నిద్ర కార్యక్రమానికి బయల్దేరారు. రాష్ట్రంలోని పల్లెలన్నీ గ్రామ పంచాయతీలుగా మారేందుకు జామతండా స్ఫూర్తిగా నిలిచి నేడు ఆ జీపీలు ప్రగతిపథంలో దూసుకుపోతుండడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు వస్త్ర పరిశ్రమకు చిరునామాగా ఉన్న వరంగల్ నగరం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పాలకుల నిర్లక్ష్యంతో ప్రాభవం కల్పోయింది. స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నది. వరంగల్‌ను వస్త్ర ఉత్పత్తి పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కును ఇక్కడ నిర్మిస్తున్నారు. సంగెం-గీసుగొండ మండలాలు కేంద్రంగా వరంగల్ నగరానికి సమీపంలో 1,190 ఎకరాల్లో టెక్స్టైల్ పార్కు ని ర్మాణం కోసం 2017 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. రూ.1,150 కోట్లతో ఐదు దశల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కు మాస్టర్ ప్లాన్ రూపొందించింది. పార్కు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన రోజునే.. వస్త్ర ఉత్పత్తిలో ప్రసిద్ధి గాంచిన 14 సంస్థలు రూ.3,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. 200కుపైగా యూనిట్లు స్థాపించే సామర్థ్యం ఉన్న మెగా టెక్స్టైల్ పార్కులో స్పిన్నింగ్, వీవింగ్, టెక్స్టైల్, నిట్టింగ్, ఉవెన్ ఫ్యాబ్రిక్, యార్న్ డయింగ్, టవల్-షిటింగ్, ఫర్నిషింగ్, గార్మెటింగ్, ప్రింటింగ్, రెడీమేడ్ వస్ర్తాల ఉత్పత్తి చేయనున్నారు. రూ.74వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో ఏర్పాటవుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి దొరకనుంది. జనగామ జిల్లా కొడకండ్లలోనూ మినీ టెక్స్టైల్ పార్కు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఏర్పాటుతో మరో 20 వేల మందికి ఉపాధి కలుగనుంది.
ప్రపంచంలోనే ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హైదరాబాద్‌కు అనుబంధంగా వరంగల్ మహానగరానికి ఈ రంగాన్ని విస్తరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వరంగల్‌లో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసింది. వరంగల్-హైదరాబాద్ దారిలో ప్రత్యేంగా ఐటీ హబ్ ఏర్పాటు చేసింది. మైండ్ ట్రీ, జెన్‌ప్యాక్ట్, టెక్ మహీంద్రా, సయంట్, క్వాడ్రంట్ కంపెనీలు వరంగల్‌లో కార్యకలాపాలు మొదలుపెట్టాయి. ఇటీవలే సాఫ్ట్‌పాత్ కంపెనీ విస్తరణలో భాగంగా వరంగల్‌లో కార్యకలాపాలను పెంచింది.