జనగామ, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అవతరణ వేడుకను జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలు ఆవిష్కరించి పండుగ వాతావరణంలో జరుపుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)లో టీఆర్ఎస్ నాయకులు పసుల ఏబెల్, బండ యాదగిరిరెడ్డి, నామాల బుచ్చ య్య, కావటి రాజయ్య, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, చిల్పూర్ మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు జనగాం యాదగిరి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ మహిళా ఇన్చార్జి సునీత, సోషల్ మీడియా ఇన్చార్జి తిప్పారపు రమ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరుదశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు జూన్ 2న ఉదయం 9 గంటల వరకు మండల కేంద్రాలు, గ్రామా ల్లో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అవరతణ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో సంబురాలు ముగించుకొని జిల్లా పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో ఉదయం 10గంటలకు జరిగే అవతరణ దినోత్సవ కార్యక్రమానికి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరుకావాలని సంపత్‌రెడ్డి కోరారు. అదేవిధంగా ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లాలో నిర్వహించే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని, 18 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలన్నారు. గతంలో చేపట్టిన పనులు మిగిలిన ఉంటే ఊదో విడుతలో పూర్తి చేయాలని సూచించారు. మొదటిరోజు గ్రామాల్లో పాదయాత్రలు, పల్లె ప్రగతి గురించి ప్రజలకు తెలిసేలా ర్యాలీలు చేయాలని, పారిశుధ్యం, వీధిలైట్లు, గ్రీన్ కవర్ వంటి కమిటీల ద్వారా సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, స్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు..
తక్కువ కాలంలో అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణను చూసి కేంద్రంలోని బీజేపీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు, జెడ్పీచైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ర్టానికి రావాల్సిన వాటాలు, ప్రాజెక్టులు ఇవ్వకుండా బకాయిలు చెల్లించకుండా తెలంగాణ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేలా కుట్రపూరితంగా సహయ నిరాకణ చేస్తుందని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు సహకారం అందించకుండా వివక్షను కొనసాగిస్తూ, రాష్ట్రానికి రోజుకో బీజేపీ నాయకుడిని పంపించి అబద్దాలు ప్రచారం చేయిస్తున్నారని, తెలంగాణలో బీజేపీ వాపును చూసి బలుపు అనుకొని మురిసిపోతుందని ఎద్దెవా చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా? ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్‌లకు బకాయిలు చెల్లింపు
గ్రామ సర్పంచులకు బకాయిల చెల్లింపుకు కోసం ఇటీవల పంచాయతీరాజ్, ఆర్ధికశాఖ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావ, హరీశ్‌రావు రాష్ట్ర వ్యాపితంగా రూ.406కోట్లు విడుదల చేశారని, జనగామ జిల్లాకు రూ.18కోట్ల బకాయి సొమ్ము ట్రెజరరీలో జమ అయిందని సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు పోకల శివకుమార్ తెలిపారు. సర్పంచులు ఎవరు బిల్లు బకాయిల గురించి ఆందోళన చెందవద్దని, ప్రతిపక్షాల చెప్పుడు మాటలు నమ్మకుండా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
– సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పీ శివకుమార్