వరంగల్, జూన్ 1 : పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య ఆదేశించారు. బుధవారం కార్పోరేషన్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 3 నుంచి 18 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి అధికారి అంకితభావంతో పని చేయాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు డివిజన్ల వారీగా ప్రత్యేక అధికారిని ఐదు డివిజన్లకు ఒక సూపర్వైజర్ అధికారి నియోజకవర్గానికి నోడల్ అధికారిని నియామించామని తెలిపారు.
బల్దియా రూపొందించిన ప్రత్యేక యాప్‌లో డివిజన్ల సమస్యలను నమోదు చేయాలన్నారు. గ్రేటర్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో డివిజన్ల సమస్యలపై వినతులు అందచేసేందుకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఉత్తమ పట్టణ జీవనానికి పట్ణణ ప్రగతి కార్యక్రమం పునాది అన్నారు. 32 డోజర్లు, 32 జేసీబీ, 32 ట్రాక్టరు సిద్ధ్దంగా ఉన్నాయన్నారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో ఒక రోజు పవర్ డే ప్రకటింటి విద్యుత్ మరమ్మతులు, నీటి సరఫరా మీటర్ల ఏర్పాటు, వంగి ఉన్న స్తంభాల తొలగింపు, చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కమిషనర్ ప్రావీణ్య పట్టణ ప్రగతిపై రూపొందించిన యాప్‌లో సమస్యల నమోదును వివరించారు. ఈ సమావేశంలో ఆదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, ఎస్ఈ ప్రవీణ్‌చంద్ర, పట్టణ ప్రగతి నోడల్ అధికారులు, సూపర్వైజర్ అధికారులు, డివిజన్ అధికారులు పాల్గొన్నారు.