పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. ప్రధానంగా శానిటేషన్, వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డులు, వర్మీ కంపోస్టు తయారీ, కరంటు, నీటి సరఫరా నిర్వహణపై గ్రామం, పట్టణం వారీగా నివేదికలు రూపొందిస్తున్నారు. గ్రామాల్లో ఇంకా చేయాల్సిన పనుల వివరాలను అందులో పొందుపర్చనున్నారు. జూన్ 1న జిల్లా కేంద్రంలో కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో పల్లె, పట్టణ ప్రగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించనునారు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
మహబూబాబాద్ రూరల్, మే 29: గ్రామాల్లో సమగ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లోని సమస్యలను పరిష్కరించి, సుందరంగా తీర్చిదిద్ది గ్రామాల రూపురేఖలు మారుస్తున్నారు. అనేక ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించడం, జీపీల్లో పాడుబడ్డ బావులను పూడ్చడం, డ్రైనేజీల్లో సీల్ట్ను తొలగించడం వంటి పనులు చేపట్టారు. సమైక్య పాలనలో అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలు నేడు పల్లె ప్రగతితో భాగంగా అందంగా తీర్చిదిద్దడంతో రూపురేఖలు మారిపోయాయి.
జూన్ ఒకటిన జిల్లా కేంద్రంలో పల్లె, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన స్త్రీశిశు సంక్షేమశాఖ మం త్రి సత్యవతి రాథోడ్ జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులతో వివిధ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ప్రధానంగా గత పల్లెప్రగతిలో సాధించిన ప్రగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పల్లెల్లో సమగ్రాభివృద్ధికి సాధనకు ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలను విజయవంతం చేసే దిశగా మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఐదో విడుతకు ఏర్పాట్లు
గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణకు తగిన కార్యాచరణ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ శశాంక జిల్లాలోని 16 మండలాల్లో 462 జీపీలు, నాలుగు మున్సిపాలిటీల్లో పల్లె ప్రగతికి పకడ్బందీగా కార్యాచరణను సంసిద్ధం చేస్తున్నారు. నాలుగు విడుతల్లో జరిగిన కార్యక్రమాల్లో చేపట్టిన ప్రగతిని సమీక్షిస్తూ ఐదో విడుత యాక్షన్ ప్లాన్‌కు అధికారులను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా బృహత్ వనాలు, గ్రామప్రజల భాగస్వామ్యం, వైకుంఠధామాలకు విద్యుత్ సౌకర్యం, మౌలిక వసతుల కల్పన, మొక్కల సంరక్షణపై యువత సహకారంతో శ్రమదాన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గతంలో జరిగిన పనులు, పెండింగ్‌లో ఉన్న వాటిని గుర్తించి ప్రణాళిక చేసి, గ్రామస్థాయిలో చర్చించి వెంటనే పరిష్కరించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా 16 మండలాల్లోని గ్రామ పంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీల్లో జూన్ 3 నుంచి ఐదో విడుత పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధికారులు సిద్ధమవుతున్నారు. జిల్లా, మండల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశాలు నిర్వహించి, పనుల నిర్వహణ, పురోగతిపై యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 27న సెక్రటరీలు, జీపీ సిబ్బందితో, 28న జిల్లాలోని ఎంపీడీవోలతో సమావేశాలు నిర్వహించారు. ప్రతి జీపీకి తప్పనిసరిగా ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి, ప్రగతిని సమీక్షిస్తూ పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.

చేపట్టనున్న కార్యక్రమాలు
జూన్ 3 నుంచి నిర్వహించే పల్లెప్రగతిలో మండలస్థాయి అధికారులు తొలుత గ్రామంలో పాదయాత్ర నిర్వహించి సమస్యలను గుర్తించనున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వ, ప్రజా ఉపయోగ సంస్థలను శుభ్రం చేసి, మొక్కలు నాటించాలి. ప్రతిరోజు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేయడం, ఒకరోజు పవర్‌డేను పాటించి గత, ప్రస్తుతం ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేవిధంగా చర్యలు చేపట్టనున్నారు. గ్రామంలోని యువతను చైతన్యపరుస్తూ శ్రమదానం, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా సిద్ధం చేయనున్నారు. కొత్తగా నిర్మించిన వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చుట, గ్రామ పర్యవేక్షణ కమిటీల ఏర్పాటు, ప్రతి కమిటీలో మహిళలు, యువత, అధికారులు ఉండేవిధంగా కమిటీని సిద్ధం చేసి హరితహార మొక్కల సంరక్షణకు చర్య లు తీసుకోనున్నారు. ప్రతిగ్రామంలో మిషన్ భగీరథ నీరు అందేలా పర్యవేక్షించి, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యచరణ చేయనున్నారు.
గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నాం
పల్లెప్రగతి కార్యాచరణపై గ్రామస్థాయిలో సెక్రటరీలు, జీపీ సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదో విడుత పల్లెప్రగతికి సిద్ధమవుతున్నాం. జిల్లాలోని 462 గ్రామాల్లో ప్రత్యేకాధికారుల ఏర్పాటుకు సమావేశాలు నిర్వహించాం. గ్రామాభివృద్ధికి దోహదం చేసే దాతలు, యువతను గ్రామ సభలకు ఆహ్వానిస్తాం. జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి పూర్తిస్థాయి కార్యాచరణను రూపొందిస్తాం. -సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి