రైతన్నల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఇప్పటికే రైతుబంధు పథకంతో ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నది. కాగా, అన్నదాతలు అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు ఇబ్బడిముబ్బడిగా వాడడంతో భూసారం దెబ్బతింటున్నదని, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నివారణకు పచ్చిరొట్ట సాగు చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. దీంతో 50శాతం ఎరువుల ఖర్చు తగ్గడంతో పాటు బహుళ ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ఈక్రమంలో భూసారాన్ని పెంచి, అధిక దిగుబడితోపాటు నాణ్యమైన పంట ఉత్పత్తులు పొందేందుకు ప్రభుత్వం 65శాతం సబ్సిడీపై జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చింది.
కేసముద్రం, మే 29: పచ్చిరొట్టతో భూమి సారవంతంగా మారుతుంది. దీంతో రైతులు జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను పొలంలో వేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. రైతులకు గతంలో ఎడ్లు, ఆవులు, గేదెలు, మేకలు అధిక సంఖ్యలో ఉండేవి. వాటి పెంటను వేసవిలో సాగు భూమిలో చల్లి పోషక విలువలు పెంచుకునేవారు. కానీ పశువులు పూర్తిగా తగ్గిపోయాయి. ఈక్రమంలో రైతులు అధిక దిగుబడి కోసం, పంటలను చీడ పీడల నుంచి కాపాడుకునేందుకు రసాయన ఎరువులను మోతాదుకు మించి వాడుతున్నారు. దీంతో భూమి చౌడుగా మారుతోంది.
సబ్సిడీపై విత్తనాలు
సహజ సిద్ధంగా భూసారాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్టను ప్రోత్సహిస్తోంది. ఎరువులు, క్రిమిసంహారక మందులు తగ్గించి సహజసిద్ధంగా పోషక విలువను పెంచేందుకు విత్తనాలను సబ్సిడీపై అందిస్తూ రైతులకు ఆర్థికభారం తగ్గిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 65శాతం భరిస్తుండగా, రైతులు 35 శాతం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ వానకాలంలో 2.14లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాకు 15వేల క్వింటాళ్ల జీలుగ, 1500 క్వింటాళ్ల జనుము, 50 క్వింటాళ్ల పిల్లిపెసరను 16 మండలాల్లోని ఆగ్రోస్, పీఏసీఎస్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. 30 కిలోల జీలుగ విత్తనాల బస్తాకు రూ.1,897 ఉండగా, రూ.1,233 సబ్సిడీపోనూ రైతులు కేవలం రూ.670 చెల్లించాల్సి ఉంటుంది. జనుము విత్తనాల బస్తాకు రూ.2,493 ఉండగా సబ్సిడీ రూ.1,623 పోను రూ.973 రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లిపెసర 30 కిలోల బస్తా రూ.2,655 ఉండగా సబ్సిడీ రూ.1,725 పోను రూ.930 రైతులు చెల్లించాల్సి ఉంటుంది.
రెండు రకాలు
పచ్చిరొట్టలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి నేలలో సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. మరొకటి నేలకు నత్రజని వంటి మూలకాలను అందజేస్తుంది. మొదటి రకానికి చెందిన మొక్కలు జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటివి. రెండో రకానికి చెందినవి జనుము, జీలుగ, పిల్లిపెసర, అలసందలు, పెసర వంటివి. ఈజాతి రకం పచ్చిరొట్ట సాగుతో వాటి బొడిపెల్లో ఉండే రైజోబియం వంటి బ్యాక్టీరియా సహకారంతో గాలిలోని నత్రజనిని స్వీకరించి వేరు బొడిపెల్లో స్థిరీకరింపజేసి నేలకు అందిస్తాయి.
అందుబాటులో..
జీలుగ, జనుము వేసిన 10 నుంచి 15 రోజుల తర్వాత వరి నార్లు పోసుకోవాలి. నాటు వేసే సమయానికి పచ్చిరొట్ట పూత దశకు వచ్చేలా చూసుకోవాలి. భూమిలో కలియ దున్నడంతో సారవంతంగా మారి పంటకు అధిక పోషకాలను అందిస్తాయి. జిల్లాకు సరిపడా జీలుగ, జనుము, పెసర విత్తనాలను మండల కేంద్రాల్లోని ఆగ్రోస్, సహకార సంఘాల్లో అందుబాటులో ఉంచాం. పీఎం కిసాన్ డబ్బుల కోసం ప్రతి రైతు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవాలి.
– ఛత్రూనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి