భూపాలపల్లి రూరల్, మే 29: జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గుర్తించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో చేపట్టిన సర్వే మే 20వ తేదీన పూర్తయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సర్వే మే 5వ తేదీన అధికారులు ప్రారంభించారు. జిల్లాలోని భవిత(ఐఈఆర్సీ) కేంద్రాలకు చెందిన ఇన్‌క్లూసివ్ ఎక్స్క్లూసివ్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ)లు ఇంటింటికీ తిరిగి దివ్యాంగుల సమగ్ర వివరాలను సేకరించారు. గత ఏడాది వరకు జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన 1,016 మంది విద్యార్థులను గుర్తించారు. ఇందులో పాఠశాలకు వెళ్తున్న వారు 768, భవిత కేంద్రాలకు వెళ్తున్న వారు 118, ఇంట్లో ఉండి చదువుకుంటున్న వారు 67, పాఠశాలకు వెళ్లని వారు 48, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్నవారు 15 మంది ఉన్నారు. జిల్లాలో మే 20వ తేదీ వరకు 84 మంది దివ్యాంగులను కొత్తగా గుర్తించారు. ఇందులో పాఠశాలకు వెళ్తున్న వారు 49, భవిత కేంద్రాలకు వెళ్తున్న వారు 11, పాఠశాలకు వెళ్లనివారు 14, అంగన్వాడీ కేంద్రాలకు వెళ్తున్నవారు 10 మంది ఉన్నారు.
పరికరాల పంపిణీకి చర్యలు
జిల్లాలోని 11 మండలాల్లో ప్రత్యేక అవసరాలు గల వారిని 15 భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న 17 మంది ఐఈఆర్పీలు సర్వేలో గుర్తించారు. మానసిక, శారీరక వైకల్యంతోపాటు వినికిడి, జన్యుపరమైన లోపాలతో పుట్టినవారిని, అంధుల వివరాలను నమోదు చేసుకున్నారు. గుర్తించిన వారికి అవసరమైన పరికరాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీల్‌ఛైర్, ట్రైసైకిల్, వినికిడి యంత్రాలు, ల్యాలీఫర్స్, రచెస్(చంక కర్రలు), మానసిక బుద్దిమాంధ్యత కిట్లు, బ్రైయిలీ కిట్లు, కళ్లద్దాలు, బ్రెయిలీ బుక్స్, రోలేటర్లు, ఫిజియోథెరపీ పరికరాలను ప్రభుత్వ సహకారంతో అందించేందుకు సమగ్ర వివరాలను ఐఈ వెబ్సైట్లో పొందుపరిచారు.
జిల్లాలో 15 భవిత కేంద్రాలు
ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో మొత్తం 21 రకాల వైకల్యాలు ఉంటాయి. అందులో నిర్ధేశిత వైకల్యాన్ని నమోదు చేయడంతోపాటు అవసరం మేర శిక్షణ కూడా ఇస్తారు. ప్రధానంగా బాల్యంలోనే వైకల్యంతో అవస్థలు పడుతున్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించే దిశగా సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఎన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టారు. 5 నుంచి 19 ఏళ్లలోపు వారికి భవిత కేంద్రాల ద్వారా పాఠశాల సంసిద్ధత నైపుణ్యాలు, ఫిజియోథెరఫీ, స్పీచ్‌థెరఫీ, ఆక్యుపంచర్ థెరపీ, వివిధ వ్యాయామాలు చేయిస్తారు. ప్రధానంగా మూడు రూపాల్లో ప్రోత్సహిస్తారు. అచేతనావస్థలో ఉన్న వారికి ఇంటి వద్దే శిక్షణ ఇస్తారు. ఐఈఆర్పీలు నేరుగా ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. కదలిక వచ్చేలా వ్యాయామాలు, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ నిర్వహిస్తారు. పరిస్థితి మెరుగైన తర్వాత భవిత కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. భవిత కేంద్రాలకు వచ్చే బాలలకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. ఈ కేంద్రాల ద్వారా పాఠశాలలకు వెళ్లేలా బాలలను సంసిద్ధం చేస్తారు.
సంక్షేమ పథకాలు అందిస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గుర్తించేందుకు చేపట్టిన సర్వేను సమర్థంగా పూర్తి చేశాం. కొత్తగా జిల్లాలో 84 మందిని గుర్తించాం. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడుతాం. మానసిక, శారీరక శిక్షణ ఇప్పించి, వైద్యసేవలు అందించి భరోసాను కల్పిస్తాం.
– ఎన్నమనేని కిషన్‌రావు,విలీన విద్యా విభాగం జిల్లా సమన్వయ అధికారి