ప్రధాని నరేంద్రమోదీ ఓ మోసగాడు.. ఆయన తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీలేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. హనుమకొండలోని తార గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన కార్మిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో దళిత బంధు పథకం అమలు చేస్తే తాను మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసినట్లు వివరించారు. రేవంత్‌రెడ్డి కొత్త బిచ్చగాడని మండిపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మికుల పక్షపాతి అన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ కేంద్రం విధానాలను తిప్పికొట్టాలని, నగరంలో 31న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
– హనుమకొండ, మే 27
హనుమకొండ, మే 27 : మోదీ మోసగాడని.. తెలంగాణకు ఆయన చేసిందేమీలేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మండిపడ్డారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని పేర్కొన్నారు. కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమకొండ తార గార్డెన్లో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, మాసోత్సవ కన్వీనర్ డాక్టర్ పుల్లా శ్రీనివాస్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. ఇక్కడ మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో దళితబంధు అమలు చేస్తే తన మంత్రి, ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేస్తానని అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. బీజే పీ అంటేనే ఝూటాకోర్ పార్టీ, కాంగ్రెస్ అంటే దొంగల పార్టీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నాశనం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. దేశాన్ని దోచుకున్న దొంగలు విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే, కేంద్రం ప్రభుత్వం వారి కి కొమ్ముకాస్తూ పేద ప్రజలపై పన్నుల భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోదీ నంబర్ వన్ కేడీ అని మంత్రి విమర్శించారు. కుటుంబ పాలన ఖతం కరో అంటున్న ప్రధాని తెలంగాణకు చేసిందేమీలేదని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక కొత్త బిచ్చగాడు వచ్చేది లేదు.. సచ్చేది లేదని అన్నారు. విజయ దశమి నుంచి దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ చక్రం తిప్పుతారని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్ దేశ్‌కీ నేత కావడం ఖాయం అన్నారు. కౌరవుల లాంటి బీజేపీ నాయకుల నుంచి దేశానికి విముక్తి కల్పించి, కేసీఆర్‌ను దేశ ప్రధానిని చేయాలని భద్రకాళి అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు. అసలు తెలంగాణ రాష్ర్టాన్ని బీట్ చేసే మొనగాడు లేడన్నారు. తెలంగాణకు అనేక అవార్డులు వస్తున్నాయని, ఏ అవార్డు వచ్చినా అది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు వస్తున్నదని, ఇందుకు మంత్రి ఎర్రబెల్లి, అధికారులను అభినందించారు. కరోనా, అధికారుల నిర్లక్ష్యంతో కార్మికుల బీమా పథకం అనుకున్న సమయానికి అమలు చేయలేదని, అందుకు క్షమాపణ చెబుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కార్మికుల వలసలు తగ్గాయన్నారు. ఇతర రాష్ర్టాల నుంచే తెలంగాణకు సుమారు 30 లక్షల మంది కార్మికులు వలసలు వస్తున్నారన్నారు. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్మికులకు కూడా టికెట్లు కేటాయించాలని చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌కు సూచిస్తున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.
భద్రకాళిని దర్శించుకున్న మంత్రి..
వరంగల్ : నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి ఆయన భద్రకాళి అలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కార్మిక బంధువు సీఎం కేసీఆర్..
– ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాసర్
సీఎం కేసీఆర్ కార్మిక బంధువని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు మ ల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రా వు కార్మిక పక్షపాతి అని ఆయ న కొనియాడారు. కార్మికులతోనే ఈ రాష్ట్రం, దేశం నిర్మితమైందని, కార్మికుల శ్రమతోనే మనమంతా బాగుంటున్నామని, అందుకే సీఎం కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు కలిసి కట్టుగా ఉండాలని, సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. ఈ నెల 31న కాజీపేట రైల్వే స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ మంత్రులు, కార్మి క సంఘాల నాయకులను ఘనంగా సన్మానించారు. సమస్యలు పరిష్కరించాలని పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సదస్సులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేటర్లు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
హక్కులను కాలరాస్తున్న కేంద్రం : ఎర్రబెల్లి
కార్మికుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని, వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంత్రి మల్లారెడ్డి కార్మికుల సమస్యలపై అధికారులతో సమీక్షించారని, త్వరలోనే కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి తెలిపారు. కేంద్రం ప్రభుత్వం కార్మికులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుందన్నారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ వస్తే ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చేవని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఫ్యాక్టరీ రాకుండా చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేట్‌పరం చేస్తోందని, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని ధ్వజమెత్తారు. దీంతో కార్మికులకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, సీఎం కేసీఆర్ ఎదురుతిరగడంతో ప్రధాని మోదీ నల్ల చట్టాలను రద్దు చేసి తోకముడిచారని తెలిపారు. కార్మికులు సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులకు లక్ష ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారని, నుంచి హనుమకొండ, వరంగల్ జిల్లాలకు 10 వేల వాహనాలు ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డికి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు.