మహబూబాబాద్, మే 27 : ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. మహబూబాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పేదల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, గుట్టు చప్పుడు కాకుండా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలకు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పనిలో పనిగా అక్కడి నుంచి వచ్చేటప్పుడు చిత్తూరు, ఒంగోలు తదితర జిల్లాల నుంచి తక్కువ ధరకు నల్లబెల్లాన్ని ఇక్కడికి తీసుకొచ్చి గుడుంబా తయారీదారులకు సరఫరా చేస్తూ రెండువిధాలా సంపాదిస్తున్నారు. ఇదే తరహాలో రవాణా అవుతున్న రేషన్ బియ్యం, నల్లబెల్లాన్ని ఇటీవల అధికారులు పట్టుకున్నారు. గూడూరు మండలంలో 140 క్వింటాళ్లు, కురవిలో 40 క్వింటాళ్లు పీడీఎస్ బియ్యం, అంతేకకాకుండా 231క్వింటాళ్ల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకొని బాధ్యులైన 347 మందిని బైండోవర్ చేశారు. రవాణాకు వినియోగించిన 27 వాహనాలను సైతం సీజ్ చేశారు. ఇదంతా అధికారుల కళ్లు గప్పి కొనసాగిస్తున్నా, కొంద రు వీరికి సహకరిస్తున్నట్లు తెలుస్తున్నది. కిందిస్థాయి అధికారులు, వారి కింద పనిచేసే కొందరు డ్రైవర్లు దాడులకు సంబంధించిన సమాచారాన్ని ముందే అక్రమార్కులకు చేరవేస్తున్నట్లు సమాచారం. దీంతో అక్రమార్కులు ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.
జిల్లాలో ఇటు పోలీసులు, అటు ఎక్సైజ్ అధికారులు మూకుమ్మడిగా దాడులు చేసి, అక్రమార్కులను పట్టుకొని పీడీయాక్టులు నమోదు చేశారు. అయినా వారు తీరులో మార్పు రావడం లేదు. వీరిలో కొందరు పీడీఎస్ బియ్యం వ్యాపారం చేస్తే, మరికొందరు నల్లబెల్లం సప్తయ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గతంలో పలు శాఖల అధికారులు సంయుక్తంగా పనిచేసి జిల్లాలో 85 నుంచి 90 శాతం వరకు గుడుంబాను అరికట్టగలిగారు. దానిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు 100కు పైగా కుటుంబాలకు పునరావాస పథకం కింద ఆర్థిక భరోసా కల్పించారు. దీంతో గుడుంబా, నల్లబెల్లం వ్యాపారం కట్టడి అయినప్పటికీ, ప్రస్తుతం కొని కొత్త బృందాలు పుట్టుకొచ్చి నల్లబెల్లం వ్యాపారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో గుడుంబాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దాడులు చేయిస్తున్నది. ఇప్పటికే గుడుంబా, నల్లబెల్లం వ్యాపారాలు చేసే 240 మందిని రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారి నుంచి రూ.2 లక్షల జరిమానాతోపాటు రెండేళ్ల వరకు జైలు శిక్షపడేలా చర్యలు చేపడుతున్నారు.
విస్తృతంగా దాడులు
జిల్లాలో గుడుంబా, నల్లబెల్లాన్ని అరికట్టేందుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చే శాం. విస్తృతంగా దాడులు చేస్తున్నాం. జిల్లాలో చుక్క గు డుంబా తయారు కాకుండా గట్టినిఘా పెడుతున్నాం. గుడుంబా, నల్లబెల్లం వ్యాపారాలు చేసే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు. ఇతరశాఖల అధికారుల సహకారం తీసుకొని గుడుంబా, నల్లబెల్లం వ్యాపారాలను పూర్తిస్థాయిలో అరికడుతాం.
– డీపీఈవో కిరణ్నాయక్
మానుకోట టు ఆంధ్రాకు రవాణా
అవినీతిపరుల భరతం పట్టి, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు రాష్ట్ర సర్కారు ఎన్నో సంస్కరణలు చేసింది. పీడీయాక్టుల వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చి అక్రమవ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్నది. అయినా వారి తీరులో మార్పు రాకపోగా, అక్రమ సంపాదన కోసం కొత్తదారులు వెతుకుతున్నారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం ఇలాంటి వారికి కాసుల వర్షం కురిపిస్తున్నది. తక్కువ ధరకు ఇక్కడ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆంధ్రాలో ఎక్కువ ధరకు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అంతేకాక అక్కడినుంచి తక్కువ ధరకు నల్లబెల్లాన్ని తీసుకొచ్చి గుడుంబా తయారీదారులకు సరఫరా చేసి, రెండు చేతులా సంపాదిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ఈ తతంగం నడిపిస్తున్న ముఠాకు కొందరు కిందిస్థాయి అధికారులు, సిబ్బంది సహకరిస్తున్నట్లు తెలుస్తున్నది.
– మహబూబాబాద్, మే 27