నెల్లికుదురు, మే 27 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమ లు చేస్తున్న ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని నైనాల ప్రాథమికోన్నత పాఠశాల, ఆలేరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్కారు బడులను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, డ్యుయల్ డెస్కులు, అవసరమున్నచోట అదనపు గదులు, వంటశాలలు, విద్యుత్ సౌకర్యం, ప్రహరీల వంటి నిర్మాణాలు చేపడుతున్నదన్నారు.
జిల్లాలో మొదటి విడుతలో 316 పాఠశాలు ఎంపిక కాగా, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకులు పాఠశాలలను పట్టించుకున్న పాపాన పోలేదని, దీంతో జూన్ మాసంలో పాఠశాలల ప్రారంభ సమయానికి సమస్యలు స్వాగతం పలికేవన్నారు. సీఎం కేసీఆర్ విద్యాభివృద్ధికి పెద్దపీట వేయడంతో సర్కారు స్కూళ్లు సకల సౌకర్యాలతో కళకళలాడుతున్నాయన్నారు. మండలంలోని నైనాల గ్రామంలో సీనియర్ నాయకుడు శివార్ల సోమయ్య ఇటీవల మృతి చెందగా, ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు. ఆలేరు గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు రూ.60వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవీనవీన్రావు, జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు ఉపేందర్, ఆలేరు సర్పంచ్ కాలేరు శ్రీవాణి, ఉపసర్పంచ్ షరీఫ్, నాయకులు విజయ్ యాదవ్, గోపాల్‌రెడ్డి, వంశీ, చిర్ర శ్రీను, లక్ష్మణ్, భోజ్యానాయక్, ఎంపీడీవో శేషాద్రి, మండల విద్యాశాఖ అధికారి గుగులోత్ రాము, పాఠశాల హెచ్ఎం లింగారెడ్డి పాల్గొన్నారు.