పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో మరింత భారమవుతున్నాయి. ప్రధాని మోదీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ట్యాక్సులు వేస్తుండడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌కు రూ.109.65, డీజిల్‌కు రూ.97.82 ఉంది. రెండేళ్ల క్రితం ఇదే నెలలో పెట్రోల్‌కు రూ.78, డీజిల్‌కు 72.44 ఉండేది. జిల్లాలో 63 బంకుల్లో రోజుకు సుమారు పెట్రోల్ 63 వేల లీటర్లు, డీజిల్ 40 వేల లీటర్లు వినియోగిస్తున్నారు. రెండేళ్ల క్రితంతో పోలిస్తే పెట్రోల్‌పై రూ.31, డీజిల్‌పై రూ.25కి పైగా పెరిగింది. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లను వినియోగిస్తుండడంతో అదనంగా ఖర్చవుతున్నది. ఫలితంగా వీటి చార్జీలు తడిసిమోపడవడంతో అన్నదాతలు ఇబ్బందులుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నర్మెట, మే 27 : ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నలకు పెరిగిన ఇంధన ధరలతో ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంచడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌కు రూ.109.65, డీజిల్‌కు రూ.97.82 ఉంది. జిల్లాలోని 12 మండలాల్లో 63 పెట్రోల్‌బంకులు నడుతుస్తున్నాయి. రోజుకు సుమారుగా పెట్రోల్ 63 వేల లీటర్లు, డీజిల్ 40 వేల లీటర్లు వినియోగిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఇదే నెలలో పెట్రోల్‌కు రూ.78, డీజిల్‌కు 72.44 ఉండేది. అంటే పెట్రోల్‌పై రూ.31, డీజిల్‌పై రూ.25పైగా భారం పడింది. యాసంగిలో పండిన ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో రైతులు ఆందోళనకు గురికాగా పెరిగిన డీజిల్ ధరతో పరోక్షంగా భారం పడుతున్నది. వరికోత యంత్రాలు(హార్వెస్టర్లు), ట్రాక్టర్ల కిరాయి పెరిగింది. దీంతో రైతన్నలపై మరింత భారం పడింది.
పెరిగిన యంత్రాల అద్దె..
వ్యవసాయ పనులు యంత్రాలపై ఆధారపడి ఉండడంతో ధరలు పెరిగాయి. దుక్కుల దున్నకాల నుంచి వరికోతలు, పండించిన ధాన్యం మార్కెట్‌కు తరలించే వరకు యంత్రాలపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంతో రైతన్నలపై పెనుభారం పడింది. రవాణా చార్జీలతో పాటు అన్ని రకాల ధరలు పెరిగాయి. దీంతో అన్ని వర్గాలపై పరోక్షంగా భారం పడింది. ప్రస్తుతం వరికోతలు కొనసాగుతుండడంతో హార్వెస్టర్ల అద్దె పెంచారు. ఇందుకు కారణం డీజిల్ ధర పెరగడమే. హార్వెస్టర్ అద్దెతో పాటు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్ల కిరాయి కూడా పెంచారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తుండగా అన్నదాతలపై సుమారు రూ.20 కోట్ల భారం పడుతున్నది.

రైతులపై మోయలేని భారం
ఎకరంలో వరి కోసేందుకు హార్వెస్టర్‌కు ఒకటిన్నర గంటల సమయం పడుతుంది. గత వానకాలంలో గంటకు హార్వెస్టర్ అద్దె రూ.1700 ఉంది. ప్రస్తుతం డీజిల్ ధర పెరగడంతో రూ.2200 నిర్ణయించారు. అంటే గంటకు రూ.500 చొప్పున రైతుపై అదనపు భారం పండింది. హార్వెస్టర్ నుంచి ట్రాక్టర్ ద్వారా మార్కెట్ లేదా ఇంటికి చేర్చేందుకు ధాన్యం ఒక్కో ట్రిప్పుకు రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.500 తీసుకుంటున్నారు. ఎకరంలో మూడు ట్రాక్టర్ల ధాన్యానికి గాను రూ.200 అదనపు భారం పడింది. డీజిల్ ధర పెంపుతో ఎకరం వరికోతకు హార్వెస్టర్, ట్రాక్టర్ అద్దె రూ.700 చొప్పున అదనపు భారం పడుతున్నది.
రైతులకు అండగా సీఎం కేసీఆర్
దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను అమలు చేస్తున్నారు. పండించిన వరి పంటకు మద్దతు ధర కల్పిస్తున్నారు. యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది. గత ప్రభుత్వాలు చేయలేని విధంగా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. గతంలో మార్కెట్ యార్డుల్లో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో రవాణా చార్జీలు తగ్గి రైతులకు ఊరట కలిగింది.
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడంతో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వరి కోతలకు హార్వెస్టర్, ట్రాక్టర్ల కిరాయి పెరిగాయి. ఇప్పుడు ఎకరానికి అదనంగా రూ.1000 అదనపు భారం పడుతున్నది. వానకాలం పంట కోసం దున్నకాల ధరలు, యూరియాపై ధరల ప్రభావం పడుతుంది. ఇలాగే డీజిల్ ధరలు పెంచితే రైతులకు మరింత ఇబ్బందులు తప్పవు. ఇప్పటికి అనేకసార్లు పెంచిన కేంద్రం ఒక్కసారి తగ్గించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్నిసార్లు పెంచారో అన్ని సార్లు డీజిల్ ధరలను తగ్గించాలి.
-మారబోయిన రాజు, రైతు, నర్మెట
సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చారు..
సీఎం కేసీఆర్ సారు వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతులకు అండగా నిలుస్తున్నారు. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ఆందోళనకు గురి చేస్తున్నది. యాసంగిలో పంటకు సాగునీరు, కరంట్‌తో పాటు మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునే అవకాశం టీఆర్ఎస్ సర్కారు కల్పించింది. రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న మోదీ సర్కారుకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది.
– కొన్నె కనకయ్య, రైతు, నర్మెట