ఒకప్పుడు సంప్రదాయ పంటలు వేసే రైతులు ఒక్కోసారి నష్టం వచ్చినా భరిస్తూ మళ్లీ అవే పంటలు వేసేవారు. లాభాలు వస్తే సరే.. లేకపోతే అప్పుల పాలయ్యేవారు. ఇలా ఎన్నో ఏళ్లుగా వరి, పత్తినే నమ్ముకున్న రైతులకు ‘కాలం’ కలిసొచ్చింది. కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్సీ కాల్వలు నిండి బావులు, బోర్లలోనే కాదు భూగర్భజలాలు అంతకంతకూ పెరిగాయి. దీంతో మూడేళ్లుగా సంప్రదాయ సాగుకు స్వస్తి చెప్పి.. కూరగాయల పంటలపై ఆసక్తి చూపుతున్నారు. ఆశించిన లాభాలు వస్తుండడంతో మిగతా రైతులూ ఉత్సాహంగా పంట వేస్తుండడంతో ఏటేటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మానుకోట జిల్లాలో గతేడాది 620 ఎకరాలుండగా ఈ ఏడాది 975 ఎకరాలకు పెరుగగా, ఈ వానకాలం సీజన్లో అనూహ్యంగా 2500 ఎకరాలకు చేరడం విశేషం.
– నర్సింహులపేట, మే 26
రైతులు కూరగాయల పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నారు. తక్కువ నీటితో కూరగాయల పంటలు సాగు చేస్తున్నారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం, పడమటిగూడెం, రూప్లాతండా, బీల్యాతండా, ఎర్రచక్రుతండా, నర్సింహులపేట గ్రామాలతో పాటు శివారు తండాల్లో కూరగాయల సాగు అధికంగా చేస్తున్నారు. బావుల్లో, బోర్లలో పుష్కలంగా నీరు లభిస్తున్న నేపథ్యంలో గతంలో కంటే ఈ సారి కూరగాయల సాగుపై రైతులు ఎక్కువ దృష్టి పెట్టారు.
ఏటా పెరుగుతున్న ఆసక్తి..
కూరగాయల సాగు విషయంలో రైతులకు రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. గతేడాది కంటే ఈ ఏడాది మండలంలో సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతన్న కూరగాయల పంటలు వేస్తున్నారు. వాటిని మండలకేంద్రంలో శనివారం అంగడి, దంతాలపల్లి తదితర గ్రామాలకు తరలించి విక్రయిస్తున్నారు. మరికొంత మంది రైతులు పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లుకు చేరవేసి మంచి ఆదాయం పొందుతున్నారు.

డిమాండ్ బాగుంది..
కూరగాయల సాగుకు తక్కువ నీరు అవసరముంటుంది. ఇతర పంటలతో పోల్చితే నీరు, ఖర్చు చాలా తక్కువ. అయితే కొన్ని రకాల కూరగాయలు మార్కెట్లో ఇప్పుడు ధర ఎక్కువగా ఉండడంతో రైతులకు లాభాలు వస్తున్నాయి.. కానీ ఇతర పంటలు సాగు చేసే కంటే కూరగాయలు వేస్తే ఖర్చు, సమయం, నీరు తక్కువగా అవసరం.
– బదావత్ వీరన్న
ఖర్చులు పోను 60వేలు మిగిలినయ్..
కూరగాయల సాగుతో ప్రతి రోజూ వాటిని విక్రయించడం వల్ల ఈ ఏడాది అన్ని ఖర్చులు పోను రూ. 60 వేల వరకు ఆదాయం వచ్చింది. వ్యవసాయ పెట్టుబడికి ఎంతో ఆసరా అవుతోంది. ఉన్న అరెకరం భూ మిలో కూరగాయలు పెట్టా ను. ఇందులో టమాట, బెండ. బుడంకాయ పంటలు సాగుచేస్తున్నాను. కూరగాయల సాగు ఎంతో బాగుంది. అయితే ఈ ఎండలకు కూరగాయలు దెబ్బతింటున్నాయి.
-జాటోత్ సీతారాం